తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఎదుర్కొనేందుకు .. జగన్మోహన్ రెడ్డి… వైసీపీ తరపున చంద్రమౌళి అనే నేతకు కుప్పం టిక్కెట్ ఇచ్చారు. ఆయన స్థానికుడు కాకపోయినా.. చిత్తూరు జిల్లాలో సుదీర్ఘ కాలంగా ఉన్నతాధికారిగా పని చేసిన అనుభవం ఉండటంతో.. గత ఎన్నికల సమయంలోనే ఆయనకు టిక్కెట్ ఇచ్చారు. ఈ సారి కూడా ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. ఓడిపోయిన తర్వాత.. అడపాదడపా.. కుప్పంకు వచ్చి.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన ఆయన.. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత మాత్రం.. కనిపించకుండా పోయారు. చివరికి నామినేషన్‌కు కూడా ఆయన నేరుగా రాలేదు. ఆయన తరపున కుటుంబసభ్యులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా… నేరుగా వెళ్లి నామినేషన్లు వేయలేదు. ఆయన తరపున.. పార్టీ నేతలే ఆ పని చేశారు. అయితే.. నామినేషన్ సమయంలో… ప్రమాణం చేయాల్సి ఉండటంతో… విజయవాడలో మేజిస్ట్రేట్ వద్దకు వెళ్లి ఆ పని పూర్తి చేశారు. ఇప్పుడు.. ఆయనపై ప్రత్యర్థిగా ఉన్న చంద్రమౌళి.. తరపున నామినేషన్లు దాఖలు చేశారు కానీ.. ఆయన ప్రమాణం సంగతేమిటో మాత్రం.. క్లారిటీ లేదు. చంద్రమౌళి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారని… కుటుంబసభ్యులు చెబుతున్నారు. స్వయంగా వచ్చి నామినేషన్ వేస్తారని వైసీపీ నేతలకు హామీ ఇచ్చారు. అయితే.. నామినేషన్ వేసే చివరి రోజు కూడా.. ఆయన రాలేదు. ఆయన భార్య, కుమారుడు మాత్రం.. ఆయన పేరు మీద నామినేషన్ వేశారు.
చంద్రమౌళి నామినేషన్ చెల్లుతుందా.. లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. నామినేషన్ సందర్భంగా ప్రమాణం చేయాలనే నిబంధనకు ప్రత్యామ్నాయాలు ఉంటే.. దాన్ని చంద్రమౌళి పాటిస్తే సరిపోతుంది. అయితే.. ఆయన అలాంటి నిబంధనలు.. అమలు చేశారనే పత్రాలు… రిటర్నింగ్ అధికారికికి… సమర్పించలేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నామినేషన్ల పరిశీలన తర్వాత అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో… అభ్యర్థి లేకపోవడం.. కుటుంబసభ్యులు కూడా లైట్ తీసుకోవడంతో… కుప్పంలో వైసీపీ నేతలు… అంతా లైట్ తీసుకున్నారు. కొన్ని జెండాలతో రోడ్డుపైకి వచ్చి ఫోటోలు దిగి.. స్థానిక మీడియాకు ఇచ్చి.. ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో.. కుప్పంలో ఎన్నికల వాతావరణమే కనిపించడం లేదు.