ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఎనిమిదో రోజు ఉదయం నుంచి కర్నూలు జిల్లాలో పాదయాత్ర మొదలౌతుంది. ఆళ్లగడ్డ నియోజక వర్గం నుంచి జిల్లాలో జగన్ యాత్ర ప్రారంభం అవుతుంది. ఉదయం పదిగంటల ప్రాంతంలో ముత్యాలపాడు బస్టాప్ వద్ద ప్రజలతో జగన్ మాట్లాడతారు. ఆ తరువాత, మరోచోట మరో ఇంటరాక్షన్. ఇలా జగన్ యాత్ర షెడ్యూల్ ఉంటుంది. అయితే, కర్నూలు జిల్లాలో సాగబోయే పాదయాత్రకు ప్రజల నుంచి, ముఖ్యంగా వైకాపా వర్గాల నుంచి ఏ స్థాయిలో స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. అందుకే, ముందుగానే ఈ జిల్లాపై వైకాపా నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం!
వైకాపాకి కర్నూలు జిల్లా అంటే ఎందుకు ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. గడచిన ఎన్నికల్లో ఇక్కడ 11 అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ దక్కించుకుంది. ఇద్దరు పార్లమెంటు సభ్యులు కూడా ఆ పార్టీ తరఫున గెలుపొందారు. 2014 ఫలితాల సమయంలో కర్నూలు జిల్లా అంతా వైకాపాదే హవా అనిపించింది. కానీ, ఆ ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత నుంచి పేరున్న నేతలు ఒక్కొక్కరుగా వైకాపా నుంచి బయటకి వచ్చి, తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అందరికంటే ముందుగా, ఎంపీ ఎస్పీవై రెడ్డి వైకాపాకి దూరమయ్యారు. ఆ తరువాత, ప్రతిపక్షంలో కీలక నేతగా ఉన్న భూమా నాగిరెడ్డి కూడా బయటకి వచ్చేశారు. అక్కడి నుంచి వలసల పర్వం మొదలైంది. ఎంపీ బుట్టా రేణుక కూడా ఈ మధ్యనే చంద్రబాబుకు జై అనేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఇతర వైకాపా నేతలు కూడా టీడీపీలో చేరారు. ఇక, నంద్యాల ఉప ఎన్నిక ఉప ఎన్నిక విషయానికొస్తే, జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సెమీ ఫైనల్స్ అంటూ ప్రచారం చేశారు. కానీ, నంద్యాల స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది.
ఇన్ని పరిణామాల తరువాత, ఇప్పుడు జగన్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో వైకాపా నేతలు ఎవరూ అంటే.. పేరున్న వారే కనిపించడం లేదు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో శిల్పా సోదరులు పార్టీలో చేరినా… ఆశించిన స్థాయిలో వారు ప్రభావం చూపలేకపోతున్నారు. జగన్ పాదయాత్ర జిల్లాకు చేరుకున్న నేపథ్యంలో పార్టీ కేడర్ ను ఎవరు నడిపిస్తారు..? జగన్ సభలకు జనాన్ని ఎవరు తరలిస్తారు..? ద్వితీయ శ్రేణి నాయకత్వం ఈ బాధ్యతల్ని మోయగలదా..? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అయితే, ప్రస్తుతం జిల్లాలో ఉన్న వైకాపా నేతల్ని ఒకతాటి మీదికి తెచ్చే బాధ్యతల్ని కో ఆర్టినేటర్ గా మేకపాటి గౌతమ్ రెడ్డికి పార్టీ అప్పగించింది. కానీ, ఆశించిన స్థాయిలో ఆయన మాటను వినే పరిస్థితిలో అందరు నేతలూ లేరని అంటున్నారు! జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలను ఆయన సెట్ చేయలేకపోతున్నారనే అభిప్రాయమూ ఉంది. ఏదేమైనా సరే, జగన్ పాదయాత్రను దిగ్విజయం చేసి తీరాలనీ, తద్వారా వైకాపాకి కొంతమంది నాయకులు దూరమైనా ప్రజలు తమతో ఉన్నారని చెప్పుకోవడానికి జగన్ కు ఆస్కారం ఉంటుంది. ఈ జిల్లాలో జగన్ పాదయాత్ర సాగుతున్నంత కాలం అక్కడి వైకాపా నేతలకు సవాలే అనడంలో సందేహం లేదు. అందుకే, ఇప్పుడు కర్నూలు జిల్లాలో జగన్ యాత్ర ఎలా సాగుతుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో బాగానే నెలకొంది.