ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులు ఘోరపరాజయం పాలవడంతో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన స్థానంలో ఎవరిని నియమించాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకొంది. తమిళనాడులో పార్టీ బలంగా లేకపోయినప్పటికీ పార్టీలో అరడజనుకి పైగా ఉన్న వేర్వేరు గ్రూపులు మాత్రం చాలా బలంగా ఉంటాయి. అవెప్పుడూ ఒకదానిని మరొకటి దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి బహుశః అదీ ఒక కారణం కావచ్చు.
ఇలంగోవన్ ఖాళీ చేసిన పిసిసి అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం నలుగురు సీనియర్ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుష్బూకి డిల్లీ నుంచి కబురు వచ్చింది. ఆమె మంగళవారం ఉదయం రాహుల్ గాంధీతో, మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో వేర్వేరుగాసుమారు రెండు గంటలసేపు సమావేశమయ్యారు. వారి సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి, అధ్యక్ష పదవి భర్తీ గురించే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అనంతరం మీడియాతో ఆమె చెప్పిన మాటలని బట్టి తమిళనాడు పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టమని సోనియా గాంధీ ఆమెని కోరినట్లు స్పష్టం అవుతోంది. “నాకు ఆ పదవి చేప్పట్టెంత అనుభవం లేదు. పార్టీలో నాకంటే చాలా మంది సీనియర్లున్నారు. కానీ నాకు ఆ బాధ్యతలు అప్పగిస్తే అందంగా స్వీకరిస్తాను,” అని కుష్భూ చెప్పారు. కనుక ఆమెనే ఆ పదవిలో నియమించే అవకాశాలు ఉన్నట్లు భావించవచ్చు. రెండు మూడు రోజుల్లోనే కాంగ్రెస్ అధిష్టానం ఆమెని రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమెకి అ పదవి అప్పగిస్తే, ఇంతవరకు పోరాడుకొంటున్న గ్రూపులన్నీ చేతులు కలిపి ఆమెకి వ్యతిరేకంగా పోరాడినా ఆశ్చర్యం లేదు.