తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా రసకందాయంలో పడ్డాయి. అమ్మ మీద పోటీకి బరిలోకి దిగడానికి అందాల ‘దేవత’గా తమిళనాట గుర్తింపు ఉన్న ఖుష్బూ సిద్ధం అవుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, పురట్చితలైవిగా అభిమానులు పిలుచుకునే జయలలిత ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కె నగర్ నియోజకవర్గం నుంచే మళ్లీ బరిలోకి దిగుతున్నారు. అయితే ఇదే స్థానం నుంచి కాంగ్రెస్, డీఎంకే పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఖుష్బూను పోటీచేయించాలని ఆ కూటమి నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఉత్తరాదికి చెందిన ఖుష్బూ తెలుగు సినిమా కలియుగ పాండవులు తో సినీరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో సెటిలయ్యారు. అప్పట్లోనే బికినీ వేసుకునే తక్కువ మందిరత హీరోయిన్లలో ఒకరుగా ఖుష్బూకు యువతరంలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. తమిళ ప్రేక్షకులు ఖుష్బూకు హీరోయిన్గా బ్రహ్మరథం పట్టారు. తమిళనాడులో మొట్టమొదటిసారిగా ఒక హీరోయిన్‌కు గుడికట్టి నిత్యపూజలు నిర్వహించారంటే అది ఒక్క ఖుష్బూ విషయంలోనే జరిగింది. ఆ రకంగా అందాల దేవతగా తమిళ ప్రేక్షకుల ఆదరణను ఆమె పొందారు. ఆమె పూర్తిగా తమిళనాడులోనే సెటిలైపోయారు.
ఇటీవలి కాలంలో వెటరన్ హీరోయిన్గా పాత్రలు చేస్తున్న ఖుష్బూ.. కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అనేక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇటీవల హిజ్రాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో ఆమె మరోసారి వారి ఆగ్రహానికి గురైన సంగతి కూడా తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ నాయకురాలిగా గుర్తింపు ఉన్న ఖుష్బూ ‘అమ్మ’ జయలలిత ఎంతో పటిష్టమైన నియోజకవర్గంగా భావించే ఆర్కె నగర్ నుంచి ఆమె మీద పోటీకి దిగడం సంచలనమే. అయితే గెలవడం అనేది లక్ష్యం కాకుండా, కనీసం జయలలిత మెజారిటీ తగ్గించినా సరే.. ఆమె ప్రాభవానికి గండికొట్టినట్లేనని ఆ పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.