ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతల్ని టీజ్ చేస్తున్నారు. పీయూష్ గోయల్ ఏపీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పోయినప్పటి నుంచి… ఆయన రోజూ ప్రెస్‌మీట్ పెట్టి.. సవాళ్లు చేస్తున్నారు. నిన్న.. ఏపీ బీజేపీ నేతలు ఎవరైనా.. డిపాజిట్ తెచ్చుకున్నా.. రూ. 5 లక్షలు ఇస్తానని బహిరంగసవాల్ చేయడంతో.. బీజేపీ నేతలు చిన్న బుచ్చుకోవాల్సి వచ్చింది. చివరికి కన్నా లక్ష్మినారాయణకు కూడా కుటుంబరావు ఆఫర్ ఇచ్చారు. నర్సరావుపేట పార్లమెంట్ బరిలో.. డిపాజిట్ తెచ్చుకుంటే రూ. పది లక్షలు ఇస్తానన్నారు. దీనిపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో.. కన్నా మీడియా ముందుకు వచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో కుటుంబరావు ఏనాడైనా పోటీ చేసి గెలిచారా? అని ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు… కానీ.. డిపాజిట్ల గురించి మాత్రం మాట్లాడటం లేదు. అదే సమయంలో.. కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబు హెలికాప్టర్లోనే డబ్బు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాగే డబ్బు సరఫరాకు పోలీసు వాహనాలను వాడుతున్నారన్నారు. ఠాకూర్‌ను డీజీపీ పదవి నుంచి తొలగించాలని సీఈసీని కోరినట్లు కూడా చెప్పుకొచ్చారు.
కన్నా విమర్శలపై కుటుంబరావు మళ్లీ వెంటనే స్పందించారు. ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోమంటే బీజేపీ నేతలకు ఉలుకెందుకని ప్రశ్నించారు. ‘నా మాటలపై కన్నా ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. హెలికాప్టర్లలో డబ్బు తరలిస్తున్నారని చంద్రబాబుపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలాగైతే దేశవ్యాప్తంగా బీజేపీ 273 హెలికాప్టర్లు వాడుతోందని గుర్తుచేశారు. బీజేపీ నేతలు వాడుతున్న హెలికాప్టర్లలో కూడా డబ్బు తరలిస్తున్నారా?, మోదీ ఆఖరి విడతలో ఆయన ఎన్నికలు పెట్టుకున్నారన్నారు. అప్పటివరకు ఇలానే డబ్బులు తరలిస్తారా? అని నిలదీశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటానని ,తాను ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు.
మొత్తానికి బీజేపీ నేతలు.. ఏపీలో దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పట్టుమని యాభై మందితో ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితి ఏర్పడింది. నర్సరావుపేట నుంచి.. పోటీ చేస్తున్న కన్నా లక్ష్మినారాయణ.. ఐదుగురితో కలికి నామినేషన్ వేశారు. ఎలాంటి ర్యాలీ చేయలేదు. ప్రచారంలో కూడా ఆయన ఎక్కడా హడావుడి చేయడం లేదు. ఇక విశాఖలో పోటీ చేస్తున్న పురందేశ్వరి పరిస్థితి ఇంకా అంతే దారుణంగా ఉంది. రోడ్డుపై ఆమె ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లోవైరల్ అవుతోంది. అందరూ ఎవరి దారిన వారు పోతూ ఉంటే.. ఆమె ఒక్కటే ప్రసంగించుకుంటూ వెళ్తున్నారు. అగ్ర నేతలుగా ఉన్న వారి పరిస్థితే అలా ఉంటే.. ఇక మిగతా వారి సంగతి చెప్పేదేముంది..?