ఓ సినిమా తీయాలంటే ఎంత శ్రమో! యేడాది కష్టం. కొన్ని సినిమాలు సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటాయి. అయితే సరైన ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పద్ధతులు పాటిస్తే… కొన్ని రోజుల్లోనే సినిమా పూర్తి చేయొచ్చు. అలా.. ఓ సినిమాని 8 రోజుల్లోనే పూర్తి చేశారు. అదే… ‘కుటుంబ కథా చిత్రమ్’. నందు, శ్రీముఖి, కమల్‌కామరాజు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. వి.ఎస్. వాసు దర్శకుడు. బడ్జెట్‌ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో రోజుకి మూడు షిఫ్టుల ప్రకారం ఎనిమిది రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశారు. నిజానికి ఒక రోజులో ఈ సినిమా ముగిద్దామనుకున్నార్ట. కానీ.. దానికి మరింత భారీ కసరత్తు అవసరమని భావించిన చిత్రబృందం.. 8 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేద్దామని ఫిక్సయ్యింది. దానికి తగ్గట్టే పకడబ్బందీ ప్రణాళికతో ఈ సినిమా పూర్తి చేశారు. అంతేకాదు… నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ పారితోషికాల్ని బాగా తగ్గించుకుని మరీ ఈ సినిమా పూర్తి చేశారు. ఓ ఇంట్లో, నాలుగైదు పాత్రల మధ్య జరిగే కథ ఇది. ఈనెల 15న విడుదల అవుతోంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే… భవిష్యత్తులో ఈ తరహా సినిమాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది.