ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మొత్తం స్థానాల్లో పోటీ చేస్తోంది. కానీ ఎవరూ.. బీజేపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోవడం లేదు. మొన్న పీయూష్ గోయల్ వచ్చి… ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారంటూ.. ఓ లేఖ విడుదల చేసి వెళ్లారు. అందరూ కామెడీగా చూశారు కానీ.. ఎవరూ పట్టించుకోలేదు. అయితే బీజేపీ నేతలు ఎవరు వచ్చినా టీడీపీపై విమర్శలు చేసి వెళ్తారు. వైసీపీని ఒక్క మాట కూడా అనరు. వైసీపీ తమ మిత్రపక్షమేనని గొప్పగా చెప్పుకున్న.. పీయూష్ గోయల్ కూడా అంతే. ఏపీకి వచ్చి టీడీపీని విమర్శించి.. వెళ్లారు. వైసీపీని ఒక్క మాట అనలేదు. ఆ సందర్భంలోనే.. బీజేపీ గెలుస్తుందని కూడా చెప్పుకొచ్చారు.
పీయూష్ గోయల్ విమర్శలకు టీడీపీ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ విసిరిన సవాల్‌కు చర్చకు సిద్ధమని ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పష్టంచేశారు. చర్చకు బీజేపీ సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరారు. రాష్ట్రంలో పోటీచేసిన భాజపా అభ్యర్థులెవరైనా ఎంపీగా డిపాజిట్ తెచ్చుకుంటే రూ.5లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు డిపాజిట్ వస్తే రూ.10లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఇక బీజేపీ నుంచి ఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచినా రూ.15లక్షలు ఇస్తానని వెల్లడించారు. ఈ నగదు బహుమతిని తన సొంత డబ్బునే ఇస్తానని స్పష్టంచేశారు. భారతీయ జనతా పార్టీ కన్నా ప్రజాశాంతి పార్టీకే ఎక్కువ ఓట్లు వస్తాయని.. కుటుంబరావు జోస్యం చెప్పారు. టీడీపీకి 135 అసెంబ్లీ సీట్లు తగ్గవని చాలెంజ్ చేశారు. ఏపీలో బీజేపీ మరణించిన పార్టీగా కుటుంబరావు తేల్చారు.
ఏపీలో పరిస్థితి కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తున్నా… ప్రచారం పేరుతో.. ఏపీకి వచ్చే బీజేపీ నేతలు.. తాము అధికారం చేపట్టబోతున్నామని.. ప్రకటించేస్తున్నారు. దీంతో నవ్వుకోవడం సాధారణ ప్రజల వంతవుతుంది. కుటుంబరావు లాంటి వాళ్లు సవాల్ చేయడానికి ఉపయోగపడుతోంది.