భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీపై అవినీతి ఆరోపణలు చేసే విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎవరూ ఊహించని.. నమ్మలేని ఆరోపణలు చేస్తూ.. ఆయన సీబీఐ విచారణలకూ డిమాండ్ చేస్తూంటారు. సీబీఐ కేంద్రం చేతుల్లోనే ఉంటుందన్న విషయం ఆయనకు తెలియనట్లు సీరియస్‌గా ఆరోపణలు చేస్తూంటారు. శనివారం అలాగే… ఏపీ ప్రభుత్వం భారీగా అధికారుల పేరుతో పర్సనల్ అకౌంట్లు తెరిచిందని… రూ. 50వేల కోట్లకుపైగా నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు. ఇప్పటికీ పీడీ అకౌంట్లలో రూ. 20వేల కోట్లు మురిగిపోతున్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
జీవీఎల్ ఆరోపణలపై… ఏపీ ప్రభుత్వం తరపున ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించారు. జీవీఎల్ చేస్తున్న ఆరోపణలు.. ఏ మాత్రం అవగాహన లేకుండా చేస్తున్నవిగా తేల్చారు. పీడీ అకౌంట్లో రూ.20 వేల కోట్లు మురిగిపోతున్నాయంటూ.. జీవీఎల్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిధులే ఉంటే రాష్ట్రం ఎందుకు అప్పులు చేస్తుందని కుటుంబరావు ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్‌కు.. ట్రెజరీలో నిధులు నిల్వ ఉండదనే విషయం కూడా తెలియదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం యూసీలు ఇవ్వలేదుంటూ చేస్తున్న ఆరోపణలకూ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో చాలా శాఖలు యూసీలు ఇవ్వలేదని కాగ్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనిపై జీవీఎల్ వివరణ ఇవ్వాలని కుటుంబరావు డిమాండ్ చేశారు.
కుటుంబరావు చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ స్పందించారు. ఆయితే ఆయన ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. కుటుంబరావు షేర్ మార్కెట్ బ్రోకర్ అని ఆయన సమాధానం చెప్పడమేంటని తప్పిచుకున్నారు. తాను చేసిన అవినీతి ఆరోపణలకు చంద్రబాబు, లోకేష్ పీడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామన్వెల్త్ , 2జీ స్కాంల కంటే పీడీ అకౌంట్ల స్కాం పెద్దదని.. జీవీఎల్ చెబుతున్నారు. మరి ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థలకు రిపోర్ట్ చేయడమో.. కోర్టులో పిటిషన్లు వేయడమో చేయవచ్చు కానీ.. ఆయన ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.