భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అధికార పార్టీ అంటే.. మాటలు పడటానికే ఉందనుకుంటారు. అదే పనిగా అవినీతి ఆరోపణలు చేయడమే కాదు.. బీజేపీపై .. ఎవరు లాజిక్లతో విమర్శలు గుప్పించినా… వారిపై వ్యక్తిగత దాడి చేస్తూంటారు. రెండు రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. షేర్ మార్కెట్ పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శలు గుప్పించారు. దానికి కుటుంబరావు వెంటనే రియాక్టయ్యారు. లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం కలిగేలా కన్నా అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కుటుంబరావు తన నోటీసులో హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అగ్రిగోల్డ్ వ్యవహారాలను కుటుంబరావే చక్కబెడుతున్నారు. అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ.. ఎలాగోలా.. ఆస్తులను అమ్మించి.. డిపాజిటర్లకు చెల్లించాలని ఆయన తీవ్రమైన ప్రయత్నాలే చేస్తున్నారు. జీఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చినా… చివరికి విజయసాయిరెడ్డి బెదిరింపుల వల్ల ఆగిపోయిందని.. ఆయన గతంలో ఆరోపించారు కూడా. జీఎస్సెల్ గ్రూపును బెదిరించడానికి విజయసాయిరెడ్డి.. ప్రధానమంత్రి కార్యాలయాన్ని వాడుకున్నారనేది.. కుటుంబరావు అభియోగం.
ఆ ఆగ్రహం అలా ఉండగానే.. ఇటీవల కన్నా లక్ష్మినారాయణ.. అగ్రిగోల్డ్ విషయంలో.. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఓ లేఖ రాశారు. దానికి కుటుంబరావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఏ మాత్రం.. సానుభూతి ఉన్నా.. ఆస్తులన్నింటినీ కేంద్రం స్వాధీనం చేసేసుకుని.. డిపాజిటర్లకు సొమ్ము చెల్లించాలని కోరుతూ.. ప్రధానమంత్రికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి రాస్తే ప్రయోజనం ఏముంటుందన్నారు. కుటుంబరావు ఇచ్చిన ఈ కౌంటర్నే .. కన్నా లక్ష్మినారాయణ తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగారు. కుటుంబరావు ఏమీ రాజకీయ నేత కాదుగా..! వెంటనే లీగల్ చర్యలు ప్రారంభించారు.
చాలా కాలంగా కుటుంబరావు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల లెక్క తేల్చే విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనే వాదన వినిపిస్తున్నారు. టీవీ చర్చల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. జీవీఎల్ నరసింహారావు చాలా సార్లు కుటుంబరావు అడిగే ప్రశ్నలకు.. టీవీ కెమెరాల సాక్షిగా నీళ్లు నమలాల్సి వచ్చింది. ఆ కోపమో ఏమో కానీ.. ఇటీవల ఆయన స్టాక్ మార్కెట్ నిపుణుడని.. ఆయనను తీసుకొచ్చి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చేశారని.. విమర్శలు గుప్పించారు కూడా. మొత్తానికి బీజేపీ నేతలకు కుటుంబరావు.. కంటగింపుగానే మారారు..!