ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ మరణవార్త… చిత్రసీమని కలచి వేస్తోంది. ప్రతిభావంతుడైన కెమెరామెన్, దర్శకుడ్ని కోల్పోవడం – తీరని లోటు. అయితే… కెవి ఆనంద్ చనిపోయింది గుండెపోటుతో కాదట. కరోనాతో. ఈ విషయాన్ని చెన్నై ఆసుపత్రి వర్గాలు ధృవీకరిస్తున్నాయి. కొన్ని రోజుల క్రిందట కెవి ఆనంద్ బంధువుకు కరోనా సోకింది. తద్వారా కెవి ఆనంద్కి కూడా కరోనా పాజిటీవ్ అని తేలింది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. చివరికి ఈ తెల్లవారుఝామున 3 గంటలకు కన్నుమూశారు. అంతా హార్ట్ ఎటాక్తోనే అనుకున్నారు. అయితే మృతదేహాన్ని ఇవ్వడానికి ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయి. కోవిడ్ నిబంధనల దృష్ట్యా మృతదేహాన్ని ఇవ్వడం కుదరదని తేల్చేశారు. ఆఖరికి ప్రముఖ కథానాయకుడు సూర్య రంగంలోకి దిగి, ఆసుపత్రి వర్గాలతో మంతనాలు జరిపినా… కుదర్లేదు. మొత్తానికి ఆనంద్ మృతి వెనుక కరోనా ఉందని తెలిశాక… ఆయన అభిమానుల హృదయాలు మరింత బరువెక్కుతున్నాయి.