పోలవరంపై తరచుగా తనదైన శైలిలో పోరాటం చేస్తున్న ఎంపి కెవిపి రామచంద్రరావు మరోసారి చంద్రబాబుపై మండిపడ్డారు. కేంద్ర అలసత్వం చంద్రబాబు స్వార్ధమే పోలవరం ప్రాజెక్ట్ పాలిట శాపంలా మారాయన్నారాయన. పోలవరం పనులపై తన అభ్యంతరాలను వివరిస్తూ తాను రాసిన 6పేజీల లేఖలోని ముఖ్యాంశాలను ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరంపై బాబు ప్రభుత్వం అన్నీ అసత్యాలు, అర్ధసత్యాలతో కాలం వెళ్లదీస్తోందన్నారు. జాతీయ ప్రాజెక్టయిన పోలవరానికి నాబార్డ్ నిధుల అవసరం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. ముంపు మండలాలను ఎపిలో కలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టంలో చేర్చిందని, దీన్నేదో తమ ఘనతగా బిజెపి, టిడీపీ చెప్పుకోవడం ఏమిటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది కాగా తన స్వార్థం కోసం చంద్రబాబు దాన్ని రాష్ట్ర పరిధిలోకి తెచ్చారన్నారు. పోలవరం నిర్మాణ సమయంలో అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తే అవకాశం ఉందని తానెప్పుడో చెప్పానన్నారు. అయితే ప్రాజెక్ట్ కేంద్రం పరిధిలో ఉంటే అలాంటి వివాదాలు తేలికగా పరిష్కారమయ్యేవంటూ అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రం తరపున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఒరిస్సా సిఎం నవీన్ పట్నాయక్‌కు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుందో కూడా తెలీదన్నారు.
అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చ అంతా ప్రజలను వంచించే రీతిలో సాగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం, ఉన్న ప్రతిపక్షం కూడా రాజకీయకారణాలతో అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో ప్రశ్నించేవారు లేక ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రజలు అడగరు కాబట్టి అసత్యాలు మాట్లాడతాం అంటూ కొనసాగించడం సరికాదన్నారు. మొత్తం మీద ఈ సారి కెవిపీ మాట్లాడిన విషయాలకి మీడియాలో మంచి కవరేజే లభించింది. నిజానికి లేఖలు రాయడంతో పాటు, వీటిలో చాలా వరకూ గతంలో కూడా కెవిపి మాట్లాడిన మాటలే అయినప్పటికీ… ఈసారి మాత్రం ప్రధాన చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేసి మరీ ఆయన వాదనను వినిపించడం విశేషం.