పోలవరం కట్టేసింది వైఎస్సేనంటూ కొద్ది రోజుల కిందటే పుస్తకం రాసి.. అచ్చేసి హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసిన కేవీపీ ఇప్పుడు జగన్‌కు ఓ లేఖ కూడా రాశారు. ఆ లేక సారాంశం ఏమిటంటే.. పోలవరం కేంద్రం బాధ్యత.. దాన్ని కేంద్రానికే ఇచ్చేయ్యమని. పోలవరం విషయంలో తంటాలు పడుతున్న జగన్‌కు ఇదే పరిష్కారం అని సూచించినట్లుగా కనిపిస్తోంది. వైఎస్‌కు సలహాలివ్వడంలో ఆత్మగా పేరు పొందిన ఆయన జగన్ వద్ద మాత్రం అలాంటి పలుకుబడి సాధించలేకపోయారు. కానీ ఆయనకు ..జగన్‌పై అభిమానం ఉంది.
అందుకే పరోక్షంగా అయినా సలహాలిచ్చే ప్రయత్నం చేస్తూంటారు. పోలవరంపై 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశం కారణంగానే జగన్‌కు సలహా ఇస్తూ కేవీపీ లేఖ రాశారు. పోలవరంపై ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత పోలవరం అథారిటేనని.. ఈ నెల 29న కేంద్రం సమక్షంలో జరిగే సమావేశంలో గట్టిగా డిమాండ్ చేయాలని లేఖలో కోరారు. కేంద్రం తీరు వల్లే పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయని చెప్పారు
పోలవరం ప్రాజెక్టు కరకట్టల నిర్మాణానికి ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని జగన్‌కు లేఖలో కేవీపీ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకుకేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ పోలవరం బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్‌పై అధ్యయనం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రాజెక్టు ప్రభావిత రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలతో ఈ నెల 29న సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. పోలవరంలో గత మూడున్నరేళ్లుగా ఒక్క పనీ జరగడం లేదు. జగన్‌కు చెడ్డపేరు వస్తోంది. అందుకే వదలించుకోవాలన్న సలహా పరోక్షంగా కేవీపీ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. మరి జగన్ ఈ లేఖను కనీసం పట్టించుకుంటారా?