ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రయివేటు బిల్లు చర్చకు రాకుండా కేంద్రంలోని బిజెపి వ్యూహాత్మకంగా అడ్డుపడిందనేది అందరికి అగుపించిన దృశ్యం. అధికారంలో ఉన్నవారు వెల్‌లోకి వెళ్లి రభస చేయడం అసాధారణం. వారే కోరుకుంటే కాంగ్రెస్ అడ్డుపడినా నిక్షేపంగా చర్చ చేపట్టే వారు.ప్రత్యేక హౌదా నిరాకరిస్తున్నది బిజెపి అయితే ఆ సమస్యపై సన్నాయి నొక్కులతో సరిపెడుతున్నది తెలుగుదేశం. కనుకనే ఇప్పుడు కూడా బిల్లు చర్చకు రాకుండా చేసిన బిజెపిని వదిలిపెట్టి కాంగ్రెస్‌పైనే తెలుగుదేశం విమర్శకు సాగిస్తున్నది. కాంగ్రెస్ గత తప్పిదాలను సాకుగా చూపించి ప్రభుత్వం నడిపించే బిజెపిని కాపాడడం అభ్యంతరకరం. తెలుగుదేశం ఈ విషయంలో పట్టుదలగా లేదుగనకే విమర్శ కాంగ్రెస్‌పైకి తిప్పింది. కేంద్ర రాష్ట్రాలలో కలిసి పాలన చేస్తున్న రెండు పార్టీల దోబూచులాటకు ఇది తాజా నిదర్శనం. అనివార్యమైన పరిస్థితుల్లో ఈ బిల్లుకు మద్దతునిస్తామని ప్రకటించిన తెలుగుదేశం కూడా తప్పించుకోవడానికి దీనివల్ల అవకాశం లభించింది. నిజానికి తెలుగుదేశం మద్దతు చెప్పిన తరువాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందిగ్ధ సంకేతాలు ఇచ్చారు. ఆప్ ఎంపీ భగవంత్‌మాన్ దుస్సాహసాన్ని సాకుగా చేసుకుని ఉభయసభల్లో రభస సృష్టించడం పథకం ప్రకారమే జరిగింది. అయితే ఇన్ని రభసల మధ్యనా సిపిఎం నేత సీతారాం ఏచూరి మాత్రం ప్రత్యేక హౌదా ఇవ్వాలని ఖచ్చితంగా మాట్లాడటం విశేషం. విభజన బిల్లు సందర్బంలోనూ హడావుడిగా ఆమోదించవద్దంటూ వాకౌట్ చేసింది ఆయనే. అప్పుడు ఐదేళ్లు కాదు పదేళ్లు హౌదా ఇవ్వాలని గొప్పగా కోరి ఎన్నికల ప్రణాళికలోనూ ప్రచారం చేసుకున్న సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఇప్పుడు మంత్రిగా వుండి కూడా మౌనం వహించారు. ప్రైవేటు బిల్లు నెగ్గినా ఫలితం వుండదని ముందే అపశ్రుతులు వదిలారు. విభజన బిల్లు ఆమోదం, ఇప్పుడు హౌదాపై బిల్లు రెండు ఘట్టాలలోనూ సీతారాం ఏచూరి ఒకే విధంగా వ్యవహరిస్తే వెంకయ్య వైఖరి తలకిందులు కావడం గమనార్హమే. రాజ్యసభలో శుక్రవారం మధ్యాహ్నం మాత్రం -అదికూడా వారం విడిచి వారం మాత్రమే – ఆ సమయంలో సెలవులు లేకుంటేనే -ప్రయివేటు బిల్లులు చర్చకు వస్తాయి. మరి ఈ ప్రత్యేక దోకా ఈసారి ఏ రూపంలో ఉంటుందో మరి!