ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయమై కాంగ్రెస్ పార్టీ విధివిధానమేంటో ఇంకా స్పష్టతకు రాలేకపోతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని నిర్ణయించినా… తెలుగుదేశం విషయమై కాంగ్రెస్ వైఖరి ఏంటనేది తేలడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నేరుగా విమర్శలు చేయడం లేదు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తాజాగా ఓ లేఖలో చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా విమర్శలు చేశారు.
దీక్షలు, సభలూ అంటూ ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శించారు. ఆంధ్రా ప్రయోజనాల కోసం దీక్షలు చేసే నైతిక హక్కు చంద్రబాబుకి లేదనీ, ఆయన చేస్తున్నవన్నీ డ్రామాలే అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము గుంటూరులో దీక్ష చేస్తే… భగ్నం చేసేందుకు గుడ్లూ టమాటాలతో కొట్టించారంటూ కేవీపీ ఆరోపించారు. కేంద్రం తీరుపై నిరసనగా నల్ల చొక్కాలు వేసుకున్నారుగానీ, ప్రయోజనాలను సాధించుకోవడంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగిపోతుండటానికి కారణం తానే అన్నట్టుగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని కేవీపీ అన్నారు.
జాతీయ రాజకీయాలకు వచ్చేసరికి కూటమిలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ లు కలిసి పనిచేయాల్సిన అవసరం కనిపిస్తోంది. దీంతో, ఏపీలో సొంతంగా పోటీ అని చెబుతున్నా… టీడీపీపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడం లేదు. కానీ, ఇప్పుడు కేవీపీ ఇలా స్పందించారు. నిజానికి, టీడీపీ కాంగ్రెస్ లు ఒకే కూటమిలోకి వచ్చిన దగ్గర్నుంచీ కేవీపీ కొంత అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయం ఉంది. అందుకే, ఆయన మౌనంగా ఉంటున్నారనీ అన్నారు. మరి, ఇప్పుడిలా స్పందించడాన్ని… టీడీపీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదే అని పరిగణించొచ్చా, లేదంటే ఆ విమర్శలు కేవీపీ వ్యక్తిగతంగా చూడాలా అనేదే ప్రశ్న..? ఇక, కేవీపీ వ్యాఖ్యల విషయానికొస్తే… ఆంధ్రా హోదా గురించి కాంగ్రెస్ పోరాటం చేసిందన్నారు. గడచిన ఐదేళ్లలో ఆంధ్రాలో కాంగ్రెస్ ఉనికే కనిపించలేదు! ఇక, వారు చేసిన పోరాటాలు ఎక్కడున్నాయి? పార్లమెంటులో కూడా ఏపీ గురించి కాంగ్రెస్ మొదట్నుంచీ పోరాడి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో? ఇప్పుడీ విమర్శల లేఖాస్త్రాలు సంధిస్తున్న కేవీపీ కూడా పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకోవడానికే పరిమితమయ్యారే తప్ప, ఇతర పార్టీల మద్దతును ఏపీ ప్రయోజనాల సాధనకు అనుకూలంగా కూడగట్టే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా..?