ఇప్పటివరకు `తెర వెనుక మంత్రంగం’ లకు పేరొందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డా. కె వి పి రామచంద్రరావు కు తొలిసారి `తెర ముందు’ నాయకత్వం అప్పచెప్పనున్నారా ? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాలలో జరుగుతున్న ఊహాగానాలను పరిగణలోకి తీసుకొంటే ఆయనను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దిగవంత ముఖ్యమంత్రి డా. వై యస్ రాజశేఖరరెడ్డి కి `ఆత్మ’ గా పేరొందిన ఆయన రెడ్డి ప్రభుత్వంలో `ప్రచ్ఛన్న ముఖ్యమంత్రి’గా వ్యవహరించారు. ప్రభుత్వంలో కీలక వ్యవహారాలు అన్నింటిని ఆయన చేబడుతూ ఉండేవారని ప్రతీతి. రాజశేఖర రెడ్డి మరణం అనంతరం కూడా రాష్ట్ర రాజకీయాలలో బలమైన పలుకుబడిగల నాయకుడిగా పేరొందారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలలో ఆయన కనుసన్నలలో నడిచే నాయకులున్నారు.
ఆయన రాజకీయ మంత్రంగం నైపుణ్యాన్ని గ్రహించిన పార్టీ అధిష్టానం 2019 ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర కాంగ్రెస్ సారధ్యాన్ని ఆయనకు అప్పచెప్పే విషయం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పదవీకాలం త్వరలో ముగియనున్న దృష్ట్యా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మార్పు తప్పనిసరి అని భావిస్తున్నారు.
తన రాజకీయ జీవితంలో మొట్టమొదటి సారిగా ముందుండి పోరాటం సాగించింది రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడం గురించి ప్రైవేట్ సభ్యుడి బిల్ ను ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే. అనూహ్యంగా ఈ బిల్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారడం, అన్ని ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా బిజెపి మిత్రపక్షాలు సహితం మద్దతు ప్రకటించడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది.
దానితో చర్చ ముగిసిన తరువాత అది ఆర్ధిక బిల్ అనే సాకు చూపి వోటింగ్ లేకుండా అధికార పక్షం బయట పడవలసి వచ్చింది. పైగా ఈ బిల్ రాష్ట్ర ప్రజలలో తీవ్రమైన `సెంటిమెంట్’ ను కలిగించింది. అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి తీవ్రమైన సవాల్ విసిరిన్నట్లు అయింది. 2019 ఎన్నికల సమయంలో ఈ అంశం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తున్నది.
అయితే ఈ బిల్ రగిల్చిన ఆవేశాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవడంలో, ప్రజలను తమ వైపు సమీకరించు కోవడంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విఫలమైనదనే అసంతృప్తి పార్టీ అధిష్టానంలో కనిపిస్తున్నది. రఘువీరా రెడ్డి ప్రజా సమస్యలపై నిర్విరామంగా ఆందోళనలు చేబడుతూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ మనుగడను చాటుతున్న ప్రజలను సమీకరించడంలో, పార్టీ కార్యకర్తలను ఉత్తేజ పరచడంలో, ముఖ్యంగా ఇతర ప్రతిపక్షాలతో సంబంధాలు ఏర్పరచు కోవడంలో విఫలం అవుతున్నారని పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
మరో వంక పార్టీ నుండి అనేకమంది సీనియర్ నాయకులు ఇతర పార్టీలకు వలస వెళ్లడాన్ని సహితం నివారించలేక పోతున్నారు. వనరులను సమీకరించడంలో, ఇతర పార్టీలు-నాయకులతో అనుబంధం ఏర్పరచు కోవడంలో కెవిపి కి మించినవారు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో కనిపించరు. అందుకనే ప్రస్తుత కష్ట కాలంలో ఆయన సారధ్యం పార్టీకి జీవం పోయగలదని భావిస్తున్నారు.