ఇంతవరకు వైకాపా ఎమ్మెల్యేల చేత వరుసగా పార్టీ ఫిరాయింపజేస్తూ జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించిన చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జగన్ చెమటలు పట్టిస్తున్నారు. జగన్ కారణంగా ఒకవైపు తెలంగాణా ప్రభుత్వంతో, మరోపక్క భాజపా, మోడీ ప్రభుత్వంతో యుద్ధం చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణా ప్రభుత్వంతో పాలమూరు ప్రాజెక్టు గురించి, మోడీ ప్రభుత్వంతో హామీల అమలుగురించి చంద్రబాబు యుద్ధానికి దిగక తప్పేలా లేదు. ఆ కారణంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. పైగా జగన్ చేస్తున్న విమర్శలకు కూడా సంజాయిషీలు ఇచ్చుకోవలసి వస్తోంది.
సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపి కె.వి.పి. రామచంద్ర రావు కూడా ఆయనకి మరో అగ్నిపరీక్ష పెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో తను ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకి తెదేపా ఎంపిలు మద్దతు పలకాలని, వీలయితే చంద్రబాబు నాయుడు ఎన్డీయేలో మిత్రపక్షాల మద్దతు కూడగట్టి బిల్లుకి ఆమోదముద్ర పడేలా సహకరించాలని కోరుతూ కె.వి.పి. రామచంద్రరావు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ వ్రాశారు. ఈనెల 13న రాజ్యసభలో ఆ బిల్లుపై చర్చ జరిగినప్పుడు తెదేపా ఎంపిలు అందరూ తప్పకుండా హాజరయ్యి దానికి మద్దతు తెలపాలని ఆయన తన లేఖలో కోరారు.
దానికి చంద్రబాబు నాయుడు ఔనని కాదని చెప్పలేరు. ఒకవేళ కాంగ్రెస్ ఎంపిలతో చేతులు కలిపితే ప్రధాని నరేంద్ర మోడీకి కోపం వస్తుంది. బిల్లుకి మద్దతు పలుకకుంటే ప్రత్యేక హోదా తదితర హామీలను సాధించుకోవాలనే శ్రద్ధ, పట్టుదల తెదేపాకు లేవని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను అంగీకరించినట్లవుతుంది. చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుందిపుడు. మరి ఈ సమస్యలన్నిటినీ ఏవిధంగా అధిగమిస్తారో చూడాలి.