ఏపికి ప్రత్యేక హోదా కోసం కెవిపి రామచంద్ర రావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఇవ్వాళ్ళ ఓటింగ్ జరుగవలసి ఉంది. దానిని ద్రవ్యబిల్లుగా పరిగణిస్తున్నామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రాజ్యసభలో ద్రవ్యబిల్లులపై ఓటింగ్ జరిపేందుకు వీలుపడదు. ప్రత్యేక హోదా కోసం కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరపడం కేంద్రప్రభుత్వానికి ఇష్టం లేదు కనుకనే జైట్లీ దానికి ద్రవ్యబిల్లు అనే టాగ్ తగిలించినట్లు స్పష్టం అవుతోంది.
ఈరోజు ఆ బిల్లు కధ ముగించేస్తానని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ గతవారమే తేల్చి చెప్పేశారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ బిల్లుని ద్రవ్య బిల్లుగా పెర్కొనప్పుడు గట్టిగా అభ్యంతరం చెప్పిన కాంగ్రెస్ పార్టీ, నిన్న అది ద్రవ్యబిల్లుగా పరిగణించవచ్చని మాట మార్చింది. ఆ బిల్లుపై అంతిమ నిర్ణయం తీసుకోవలసింది డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ కనుక దానిని ద్రవ్యబిల్లుగా పరిగణించి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి ఈ కధకి ముగింపు పలకవచ్చు.
కానీ, ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జైట్లీ చేసిన ప్రకటన తరువాత, ఏపిలో మళ్ళీ ప్రత్యేక వేడి రగులుకొంది. మిత్రపక్షమైన తెదేపా కూడా కేంద్రప్రభుత్వాన్ని తప్పు పడుతూ పార్లమెంటు లోపలా బయటా ఆందోళనలు చేస్తోంది. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ భాజపాతో తెగతెంపులకి సిద్దం అనే సంకేతాలు పంపిస్తున్నారు. గత రెండేళ్లుగా జి.ఎస్.టి.బిల్లుకి అడ్డుపడుతున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మొన్న దానికి అనుకూలంగా ఓటు వేసి గెలిపించాయి. కనుక అటు మిత్ర పక్షాన్ని, ఇటు ప్రతిపక్షాలని సంతృప్తి పరిచేందుకు బిల్లుపై ఓటింగ్ జరిపినా జరుపవచ్చు. అది రాజ్యసభలో నెగ్గినంత మాత్రాన్న మోడీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు ఉండదు.
ప్రత్యేక హోదా అంశంతో రాజకీయ పార్టీలన్నీ రాజకీయ మైలేజ్ కోసమే ఆరాటపడుతున్నాయి తప్ప నిజంగా దానిని అమలుచేయాలని చితశుద్ధితో కోరుకోవడంలేదని కేంద్రప్రభుత్వం కూడా గ్రహించింది. కనుక వాటిని సంతృప్తి పరచడానికి రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించి అది లోక్ సభకి వచ్చినప్పుడు, అప్పుడు ఏవో ఏవో కుంటిసాకులు చెప్పి తిరస్కరించవచ్చు. కనుక నేడు రాజ్యసభలో కెవిపి ప్రైవేట్ బిల్లుని ఆమోదించినా తిరస్కరించినా అది చివరికి అటకెక్కక తప్పదని భావించవచ్చు.