నాయకుల పార్టీ వీడి వెళ్లిపోతున్నప్పుడు… ఏ పార్టీ అయినా ఒకలాగే స్పందిస్తుంది! కొందరు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదనీ, కార్యకర్తలు మా వెంట ఉన్నారని భరోసా నింపే ప్రయత్నం చేస్తుంది. అయితే, ఇలాంటి సమయంలో మాటలు మాత్రమే సరిపోతాయా..? చేతల్లో కూడా ఏదో ఒకటి కనిపించాలి, ఎవరో ఒకరు చేసి చూపించాలి. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తానే పెద్ద దిక్కు అన్నట్టుగా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఇప్పుడు చెప్పుకుంటున్నారు! అయితే, ఆ పెద్దరికమంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో విలేకరుల సమావేశాల వరకే పరిమితం అవుతోందా..? కత్తులు దూస్తాం, సత్తా చాటుతాం అనే ఉద్వేగ ప్రకటనలు కేవలం నోటి మాటలుగానే మిగులుతున్నాయా..? హైదరాబాద్ లో చూపిస్తున్న చొరవా చురుకుదనం క్షేత్రస్థాయి వరకూ చేరడం లేదా..? ఇలాంటి ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానం చెప్పుకోవాలి. పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమంత ప్రభావితం చేయలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
సంక్షోభాల్లోనే అవకాశాలు అందిపుచ్చుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ చెబుతుంటారు. మరి, ఈ మాటల్ని ఆదర్శంగా తీసుకుని ఎల్. రమణ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారా అంటే.. లేదనే చెప్పాలి. ఎందుకంటే, రేవంత్ రెడ్డి పార్టీ వీడిన తరువాత.. టీడీపీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మండల స్థాయి నేతలు కూడా ఇతర పార్టీలవైపు చూస్తున్న పరిస్థితి. అలాగని, అందరూ పదవుల కోసమే పార్టీ మారుతున్నారని చెప్పడం సరైంది కాదు! టీడీపీకి భవిష్యత్తు ఉండదేమో, కాంగ్రెస్ లోగానీ తెరాసలోగానీ చేరిపోతే రాజకీయ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదన్న అభిప్రాయం చాలామంది నేతల్లో నెలకొంది. అంటే, పార్టీ అధ్యక్షుడిగా కింది స్థాయి కేడర్ లో తెదేపా భవిష్యత్తుపై భరోసా నింపడంలో రమణ ఫెయిల్ అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. రాష్ట్రం సంగతి కాసేపు పక్కన పెడితే, సొంత నియోజక వర్గంలో కూడా రమణ వలసల్ని ఆపలేకపోతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు తెదేపాలో రమణ ఒక్కరే మిగిలారు! రమణకి మొదట్నుంచీ చేదోడు వాదోడుగా ఉంటున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక, జిల్లాలోని ఇతర నియోజక వర్గాల ఇన్ ఛార్జులు కూడా పార్టీకి రామ్ రామ్ అనేశారు. సిరిసిల్ల, మంథని, హుస్నాబాద్, మానకొండూరు.. ఇలా కీలక నియోజక వర్గాల టీడీపీ ఇన్ ఛార్జులు అధికార పార్టీలో చేరిపోయారు. తన సొంత జిల్లాలోనే పార్టీ నేతల్ని ఆయన కాపాడుకోలేకపోతున్నారు అని చెప్పొచ్చు. అయితే, ఈ పరిస్థితికి ఆయన ఒక్కరే కారణం కాకపోవచ్చు. ఇప్పటికిప్పుడు రమణ చొరవ చూపకపోవడమే ఈ పరిస్థితి మొత్తానికి కారణమని విమర్శించడం కూడా ఈ చర్చ ఉద్దేశం కాదు.
రాష్ట్రంలో మారిన ఇతర సమీకరణాలు కూడా ఇక్కడ ప్రభావితం చేశాయి. కానీ, ఒక ప్రముఖ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేతల్ని కాపాడుకుని, పార్టీ భవిష్యత్తుపై భరోగా కల్పించే విధంగా చేసిన కృషి ఎంతో కొంత కనిపించాలి కదా. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితే ఇప్పుడు లేదు. పార్టీకి అంత సత్తా ఉందీ, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలున్నారు, స్వార్థ నాయకులు పోయినా పార్టీ నష్టం లేదు.. అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే కంటే, కింది స్థాయిలో నేతలకి భరోసా కల్పించే ప్రయత్నం ఇప్పటికైనా మొదలు కాకపోతే… తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతుంది! ఏదేమైనా, ప్రస్తుత సంక్షోభంలో పార్టీ అద్యక్షుడిగా రమణకు ఏ ఒక్క అవకాశమూ కనిపించడం లేదనే అనిపిస్తోంది!