తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ వచ్చే ఎన్నికలలో పోటీ చేయదలచుకోలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పినట్లు మీడియాలో ఒక వార్త వచ్చింది. తనకి రాజ్యసభ సీటు గానీ ఏదైనా నామినేటడ్ పదవి కానీ ఇప్పించాలని ఆయన చంద్రబాబుని కోరినట్లు పేర్కొంది. తెదేపాకి అనుకూల మీడియాలోనే ఈ వార్త రావడంతో దానిని అధికారిక సమాచారంగానే భావించవచ్చు.
తెలంగాణాలో తెదేపా చాలా బలహీనపడినప్పటికీ, సాగునీటి ప్రాజెక్టులలో అవినీతికి వ్యతిరేకంగా తెరాస ప్రభుత్వంతో తెదేపా చాలా గట్టిగానే పోరాడుతోంది. అసలు ఆ అవినీతి సంగతి తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డే ముందు బయటపెట్టారు. ఆ తరువాత మల్లన్నసాగర్ భూసేకరణని వ్యతిరేకిస్తూ ఆయన రెండు రోజులు దీక్ష చేశారు. ఆ తరువాతే తెరాస ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆ పోరాటాన్ని టీ-కాంగ్రెస్ నేతలు హైజాక్ చేసి ఎత్తుకుపోయారు. అది వేరే సంగతి. కానీ తెలంగాణాలో తెదేపా పూర్తిగా బలహీనపడలేదని రేవంత్ రెడ్డి రుజువు చేసి చూపించగలిగారు. ప్రస్తుతం మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్య, సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి, ఎంసెట్ పేపర్స్ లీకేజ్ వ్యవహారం, తెలంగాణా యూనివర్సిటీల వైస్-ఛాన్సిలర్ నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంవంటి సంఘటనలతో తెలంగాణా ప్రభుత్వం చాలా ఇబ్బందులుపడుతోంది.
ఇటువంటి సమయంలో పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్వయంగా ముందుండి తెరాస ప్రభుత్వంపై పోరాటం ఉదృతం చేసి, పార్టీని పునర్మించుకొనే ప్రయత్నం చేయకుండా అస్త్ర సన్యాసానికి సిద్దం అయితే, తెరాస ధాటికి డీలా పడిన తెదేపా శ్రేణులు ఇంకా డీలా పడిపోవడం ఖాయం. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా అందిపుచ్చుకొని తెరాస ప్రభుత్వంపై యుద్ధం చేస్తూ తెలంగాణా తెరాసకి తమ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అని ప్రజలు గుర్తించే చేయగలుగుతున్నారు. నిజానికి, కొన్ని రోజుల క్రితం వరకు వరుస ఓటములు, అంతర్గత కలాహలు, పార్టీ ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అందరూ అనుకొంటే, అది మళ్ళీ లేచి నిలబడి తెరాస ప్రభుత్వాన్ని బలంగా డ్డీ కొంటోంది. చివరికి తెలంగాణాలో ఉనికే కనబడని వైకాపా కూడా మళ్ళీ లేచి నిలబడాలని ప్రయత్నిస్తోంది. కానీ అకస్మాత్తుగా తెదేపా డీలా పడిపోయినట్లు కనిపిస్తోంది. అవకాశాలు అందివస్తున్నప్పుడు వాటిని తెదేపా నేతలు ఉపయోగించుకోకుండా అస్త్ర సన్యాసానికి సిద్దపడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.