వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరింత శక్తిమంతం అవుతుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. కేసీఆర్ పాలనలో లోపాలను ఎత్తి చూపుతూ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు! తెలంగాణలో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ తమదేననీ, బలమైన కేడర్ తమకు ఇప్పటికీ అలానే ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఇప్పట్నుంచే ఒక వ్యూహంతో సిద్ధమౌతున్నామనీ, పదివేల మందికి శిక్షణ ఇస్తున్నామని రమణ చెప్పారు.
ముందస్తు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమే అన్నారు! పార్టీకి ఎన్నికలు అంటే కొత్త కాదనీ, పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల స్వల్ప వ్యవధిలో అధికారంలోకి వచ్చిందని ఎల్. రమణ గుర్తుచేశారు. పొత్తుల విషయమై మాట్లాడుతూ… ఎన్నికలకు ముందుగానే పొత్తులపై స్పష్టత ఇస్తామన్నారు. కలిసొచ్చే పార్టీలన్నింటితోనూ సమష్టిగా తమ పోరాటం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
నిజానికి, టీడీపీకి ఎన్నికలంటే కొత్త కాకపోవచ్చు! కానీ, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎదుర్కోబోతున్న పరిస్థితి గతంలో ఎన్నడూ అనుభవంలోకి రానిది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ టీడీపీలో ఉంటే రాజకీయ మనుగడ ఉండదనే ఒక అభద్రతాభావం నాయకుల్లో పెరిగింది. ఫలితంగా.. పార్టీలో చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ లేని పరిస్థితి వచ్చింది. పోనీ, ఉన్న నాయకులైనా తెలంగాణలో పార్టీ శాఖను అనూహ్యంగా బలోపేతం చేద్దామనే చిత్తశుద్ధి కనబరచారా అంటే… అదీ లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, భాజపా, కొత్త పార్టీ తెలంగాణ జనసమితి కూడా ఎప్పటికప్పుడు యాత్రలూ సభలూ ర్యాలీలు అంటూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నం టీడీపీ నేతలు చేసిందే లేదు.
తెలంగాణలో పొత్తుల వరకూ రమణ మాట్లాడుతున్నారు. కలిసొచ్చే పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతాం అంటున్నారు. వాస్తవం మాట్లాడుకుంటే… ఇతర పార్టీలు టీడీపీతో కలిసొచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు. ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్లాల్సిన స్థితిలో పార్టీ ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వస్తున్నప్పుడు తప్ప… ఇతర సమయాల్లో టీ టీడీపీకి సంబంధించిన హడావుడి అంటూ ఏదీ కనిపించదు! పోనీ, పార్టీ అధ్యక్షుడిగా ఎల్. రమణ కూడా ఏదో ఒక అంశంతో ఉన్న కేడర్ తో సమాలోచనలూ సమావేశాలూ జరుపుతున్న పరిస్థితీ ఉన్నట్టులేదు.