తెలంగాణలో మహా కూటమి ఏర్పాటు దిశగా చర్యలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. టీడీపీతో కలిసి పనిచేసేందుకు సీపీఐ సుముఖత వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని ఇరు పార్టీల నేతల భేటీ అనంతరం టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రకటించారు. భావ సారూప్యతగల పార్టీలన్నింటినీ కలుపుకుని కూటమి ఏర్పాటు చేస్తామనీ, అందరికీ ఆహ్వానాలు పంపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక అన్ని పార్టీలకు చెందిన నేతల్నీ తెరాసలోకి లాక్కున్న పరిస్థితి ఉందనీ, ప్రతిపక్షాలందరినీ కలుపుకుని ఆదర్శవంతమైన పాలన ఇస్తామన్న సాగిస్తామన్న కేసీఆర్, ఆ దిశగా ఒక్కరోజైనా ప్రయత్నించింది లేదన్నారు.
తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ పార్టీ ఇలా అన్ని పార్టీలనూ పిలుస్తున్నామనీ, ఎవరైతే ముందుకు వస్తున్నారో వారితో చర్చలు జరుపుతున్నామని రమణ చెప్పారు. మహా కూటమిలో కాంగ్రెస్ తోపాటు టీడీపీ ఉంటుందా అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా… భావ సారూప్యత కలిగిన అన్ని పార్టీలతో ముందుకెళ్తామన్నారు. మహా కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్నది చర్చే కాదనీ, అందరం సమష్టిగా కలిసి మాట్లాడుకుంటామనీ, కచ్చితమైన నిర్ణయాలతో ముందుకెళ్తామన్నారు. ఆ తరువాత, చాడా వెంకట రెడ్డి మాట్లాడుతూ… ఈరోజు జరిగిన భేటీకి ప్రాథమికంగా కొన్ని అంశాలపై చర్చించామనీ, సీట్లు ఎన్ని అనే సంఖ్య కంటే కచ్చితంగా గెలుపు అవకాశం ఉన్న సీట్ల కోసం ప్రయత్నిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీతో తాము ఇది వరకూ మాట్లాడలేదనీ, ఎన్నికల పొత్తుల ప్రస్థావనే తమ మధ్య రాలేదన్నారు చాడా.
భావ సారూపత్యగల పార్టీలను టీడీపీ ఆహ్వానిస్తూ, ఆ క్రమంలో కాంగ్రెస్ కి కూడా ఆహ్వానం పంపామని రమణ చెప్పడం విశేషమే! ఎందుకంటే, పొత్తుల ప్రయత్నమంటూ మొదలుపెడితే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నుంచి ప్రారంభం కావాలి కదా! కానీ, కాంగ్రెస్ ముందుకొస్తే వారితో చర్చిస్తామని రమణ అంటున్నారు! టీడీపీ చర్చలకు పిలిస్తే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వస్తుందా అనేదే ప్రశ్న? పొత్తుల దగ్గరకి వచ్చేసరికి టీడీపీ ముందుగానే చొరవ తీసుకుంటూ ఉండటం గమనార్హం. తమతో కాంగ్రెస్ కలిసి వస్తుందన్న ధోరణిలో టీడీపీ అప్రోచ్ కనిపిస్తోంది. కానీ, కాంగ్రెస్ వెంట నడవాల్సిన పరిస్థితిలో కదా టీటీడీపీ ఉంది! ఇక, మహా కూటమిలో సమష్టి నాయకత్వం అంటున్నారు. కాంగ్రెస్ కూటమిలో చేరితే… నాయకత్వం కచ్చితంగా కోరుకుంటుంది. బలమైన ప్రధాన పార్టీగా కోరుకున్నా కొంత సమంజసంగానే ఉంటుంది. చూడాలి… ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాల వైపు అడుగులు వేస్తాయో మరి!