తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మెల్లగా టీఆర్ఎస్ ఆకర్ష్‌కి ఆకర్షితుడైనట్లుగా కనిపిస్తోంది. ఆయన ఈ ఆదివారం.. సొంత నియోజకవర్గం జగిత్యాలకు వెళ్లి సుదీర్ఘ కాలంగా తనతో పాటు ఉన్న క్యాడర్‌తో సమావేశమయ్యారు. పార్టీ మారుతున్నట్లుగా పరోక్షంగా చెప్పేశారు. ఇతర పార్టీలోకి వెళ్తే ఏమీ ఆశించొద్దని.. ఆశించి జరగపోతేనే నష్టంమని సూక్తులు చెప్పారు. తాను ఏదీ ఆశించనని.. ఎమ్మెల్సీలు, మంత్రి పదవుల ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. టీఆర్ఎస్లో 70 శాతం మంది సన్నిహితులేనని చెప్పడం ద్వారా.. అదే పార్టీలోకి వెళ్తున్నట్లుగా తేల్చేశారు.
తన పనిని మెచ్చి చంద్రబాబు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని.. అయితే ఎంత చేసినా.. టీడీపీ ముందుకు వెళ్లడం లేదన్నారు. ఎల్.రమణ మాటల్ని బట్టి చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నేత.. క్లీన్ ఇమేజ్ ఉన్న నేత అయిన ఎల్.రమణ కారెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈటల బీజేపీలో చేరుతున్న సమయంలోనే ఎల్.రమణ టీఆర్ఎస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.ఎల్.రమణకు టీఆర్ఎస్లో ఎలాంటి పదవులు ఇస్తారన్నదానిపై ఇప్పటికే జోరుగా చర్చ సాగుతోంది. అయితే.. కేసీఆర్ వ్యవహారశైలిపై పూర్తి అవగాహన ఉన్న ఎల్.రమణ… అందుకే ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని ముందుగానే క్యాడర్‌కు సూచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
గతంలో మండవ వెంకటేశ్వరరావు సహా అవసరంలో పలువురు టీడీపీ నేతలకు.. కండువాలు కప్పారు. కానీ.. తర్వాత వారి సంగతి పట్టించుకోలేదు. ఇప్పుడు ఈటలకు ప్రత్యామ్నాయంగా.. ఎల్.రమణను ఆహ్వానిస్తున్నప్పటికీ.. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. ఎల్.రమణ.. ఇతర కారణాల రీత్యా… రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఇటీవల ఎమ్మెల్సీగా పోటీ చేయడం తప్పి… టీడీపీ అధ్యక్షుడిగా తెలంగాణలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు.