L2: Empuraan movie review
తెలుగు360 రేటింగ్ 2.75/5
సాధారణంగా కథలో కథానాయకుడు లేదా ప్రతినాయకుడి శత్రు శేషాలు మిగిలిపోవడం వలన పార్ట్ 2 కథలకు ఆస్కారం దొరుకుతుంది. మలయాళంలో వచ్చిన ‘లూసిఫర్’ కథ మాత్రం దీనికి భిన్నం. అసలు ఈ కథలో కథానాయకుడు ఎవరనేదే పెద్ద ప్రశ్న. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజువారియర్ ప్రధాన పాత్రలుగా 2019లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కి మంచి ఆదరణ దొరికింది. గాడ్ ఫాదర్ గా ఈ సినిమాని తెలుగులో చిరంజీవి రీమేక్ చేశారు. అయితే అంతగా వర్క్ అవుట్ కాలేదు అది వేరే సంగతి. ఇప్పుడీ సినిమాకి పార్ట్ 2 వచ్చింది. మరి సెకండ్ పార్ట్ లోనైనా స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషి అబ్రామ్ (మోహన్ లాల్) ఎవరో తెలిసిందా? అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్టీఫెన్ మళ్ళీ కేరళ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? ఈసారి రాజకీయ క్రీడ ఎలా సాగింది?
కేరళ ముఖ్యమంత్రి పీకే రామ్ దాస్(సచిన్ ఖేడ్కర్) మరణానంతరం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుంది. రామ్ దాస్ అల్లుడు బిమల్ (వివేక్ ఒబెరాయ్) అసాంఘిక శక్తులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తాడు. అతడి ఆగడాలకు స్టీఫెన్ నెడుంపల్లి(మోహన్ లాల్) అడ్డుకట్టవేసి పార్టీని నిలబెట్టి అధికారాన్ని రామ్ దాస్ కొడుకు జెతిన్ (టివినో థామస్) చేతిలో పెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఇది తొలిసగం కథ.
ఐదేళ్ళు అధికారంలో వున్న జతిన్ పార్టీ సిద్ధాంతాలతో విభేదిస్తాడు. తను పాలన చేస్తుంటాడే గానీ పార్టీ రూల్ బుక్ అతడికి ఏ మాత్రం కిట్టదు. దీంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీని అనౌన్స్ చేస్తాడు. నార్త్ లో బలంగా పాతుకున్న ఓ పార్టీతో పొత్తుపెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు. అదే జరిగితే కేరళలో మత సామరస్యానికి విఘాతం కలుగుతుందని ఆ పార్టీ పెద్దలే భావిస్తారు. ఈ సంగతి విదేశాల్లో డ్రగ్ కార్టేల్స్, గ్యాంగ్ వార్స్ లో బిజీగా వున్న స్టీఫెన్ నెడుంపల్లి (మోహన్ లాల్) చేరుతుంది. తర్వాత ఏం జరిగింది ? స్టీఫెన్ మళ్ళీ కేరళ వచ్చాడా? జతిన్ కొత్త రాజకీయ పార్టీ ఎత్తుగడ పారిందా? ప్రియదర్శి (మంజు వారియర్) ఈ రాజకీయ కుట్రని ఎలా అడ్డుకుంది? ఖురేషి అబ్రామ్ అసలు ఐడెంటిటీ బయటపడిందా? అనేది మిగతా కథ.
దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లూసిఫర్ ని కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రచారం చేస్తున్నాడేగానీ ఒక ఫిల్మ్ మేకర్ గా తనకు ఈ దేశంలో జరిగిన, జరుగుతున్న కొన్ని ఘటనలపై స్పష్టమైన స్టాండ్ వుంది. ఆ స్టాండ్ ఏమిటో, దర్శకుడు ఎటువైపు ఉన్నాడో ఈ సెకండ్ పార్ట్ తో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే కనిపించింది. ఈ కథకు బీజం మత సామరస్యం అనే పాయింట్. మతాన్ని రాజకీయం ఏ రకంగా ఆడిస్తుందో చెప్పడానికి ఒక మిస్టరీయస్ పాత్రని క్రియేట్ చేశాడు. ఆ పాత్రకు ‘స్టీఫెన్’, ‘ఖురేషి’ అబ్ ‘రామ్’.. అని పేరుపెట్టాడు. ఈ పేరుతోనే తాను ఎలాంటి కథని సమాజానికి చెప్పదలచుకున్నాడు అనేది అర్ధం చేసుకోవచ్చు. అసలు ఈ కథలో కథానాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ పుట్టాడు? దేనికోసం పని చేస్తున్నాడు? ఇలాంటి వివరాల్లోకి వెళ్ళకుండా మరోసారి మిస్టీరిస్ గానే ఈ కథనం నడిపాడు.
ఇరాక్ లో ఇంటెల్జెన్స్ జరిపే ఓ ఎటాక్ సీక్వెన్స్ తో కథ మొదలౌతుంది. ఈ ఫస్ట్ సీనే ఇంటర్వెల్ బ్యాంగ్ గా రావడం స్క్రీన్ ప్లే రైటింగ్ లో మెరుపు. ఇక దర్శకుడు ఈ కథలో చెప్పదలచుకున్న అసలు పాయింట్ ఓ మత మారణహోమం. కథలో సెకండ్ సీక్వెన్స్ గా వచ్చే ఈ సన్నివేశాన్ని విజువల్ గా నెక్స్ట్ లెవల్ లో తీశాడు. కానీ ఇందులో చూపించే కంటెంట్ చాలా వివాదాస్పదమైనది, చర్చనీయాంశమైనది. దర్శకుడు ఒక స్టాండ్ తీసుకొని చెప్పాడు. దీనిపై వచ్చే విమర్శలు చర్చలు తెరపైకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నాయి.
లూసిఫర్ లానే హీరో తెరపైకి రావడానికి దాదాపు ముఫ్ఫై నిమిషాలకు పైనే పట్టేస్తుంది. ఈ గ్యాప్ లో డ్రామాని బిల్డ్ చేసే ప్రయత్నం చేశాడు. హీరో తెరపైకి వచ్చాక.. అక్కడి నుంచి పీక్ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్లారు. ఆ క్రమంలో వచ్చే విజువల్స్ చూడానికి గ్రాండ్ గా వున్నప్పటికీ ప్రతిది స్లోమోషన్ తీయడం ఒక దశలో లాగ్ అనిపిస్తుంది. కంటెంట్ లేకుండా ఎందుకు సాగాదీస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది.
సెకెండ్ హాఫ్ లో అసలు పొలిటికల్ డ్రామా మొదలౌతుంది. పార్టీ లీడర్ గా మంజువారియర్ వచ్చే సీక్వెన్స్ ని బాగా డిజైన్ చేశారు. ఓ సీన్ లో పార్టీ జెండాని నేలపై పడిపోయి నలిగిపొయింటుంది. దానిపై ఓ క్లోజప్ పడుతుంది. ఆ క్లోజప్ కి జస్టిఫికేషన్ ..అదే పార్టీ జెండాని చీరగా కట్టుకొని వస్తుంది మంజువారియర్. ఆ సీన్ భలే కుదిరేసింది. నిజానికి సెకండ్ హాఫ్ లో అలాంటి మరో రెండు సన్నివేశాలు వుంటే సినిమా మరోస్థాయిలో వుండేది. మోహన్ లాల్ పాత్రని ఎదురులేని మనిషిగా తీర్చిదిద్దారు. దీంతో కథలో సంఘర్షణ వుండదు. ఎలాంటి పరిస్థితినైన చక్కదిద్దే బలం వున్న హీరోయిజం వన్ సైడ్ గా అనిపిస్తుంది. అయితే సెకండ్ పార్ట్ లో సయ్యద్ ( ఫృథ్వీ రాజ్ సుకుమారన్) పాత్ర కథని పరిపూర్ణం చేస్తుంది. ఆ పాత్ర పగ తీరుతుంది. కానీ స్టీఫెన్ నెడుంపల్లి(మోహన్ లాల్)కి కొత్త శత్రువు వస్తాడు. దీంతో మూడో పార్ట్ కి లీడ్ వదిలారు.
మోహన్ లాల్ మరోసారి తన ప్రజెన్స్ ఆకట్టుకున్నారు. తన పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ సహజంగానే కుదిరింది. అయితే స్లో మోషన్ షాట్స్ తగ్గిస్తే ఇంకాస్త నేచురల్ గా వుండేది. అడవిలో చేసి ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లో ఆయన కష్టం కనిపిస్తుంది. ఫృథ్వీ రాజ్ సుకుమారన్ పాత్ర మరోసారి ఆకర్షణగా నిలిచింది. కనీసం హాఫ్ పేజీ డైలాగులు కూడా లేని పాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. హనుమంతుడిలా అండగా నిలబడే పాత్ర తనది. మంజువారియర్ కి మంచి సీన్లు పడ్డాయి. టివోనో ఈసారి విలన్ షేడ్ తీసుకున్నాడు. అభిమన్యు సింగ్ మరోసారి భయపెట్టాడు. మిగతా పాత్రలు పరిధిమేర కుదిరాయి.
సినిమాని చాలా లావిష్ గా తీశారు. విజువల్స్ రిచ్ గా వున్నాయి. ఫొటోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. మలయాళం నుంచి మేకింగ్ పరంగా ఇంత క్వాలిటీతో సినిమా రావడం కచ్చితంగా అభినందించదగిన విషయం. నేపధ్య సంగీతం ఇంకాస్త బలంగా వుండాల్సింది. భాష పరంగా కొన్ని ఇబ్బందులు వున్నాయి. హిందీ సినిమాగా మొదలై, హాలీవుడ్ సినిమాగా మారి, కేరళ చిత్రంగా అనిపించే అవకాశం వుంది. డైలాగులు పూర్తిగా అర్ధం కావాలంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ నాలుగు భాషలు తెలియల్సిందే. లూసిఫర్ సినిమాకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది. ఆ సినిమా నచ్చిక ప్రేక్షకులు ఈ రెండో సగం కూడా నచ్చుతుంది.
తెలుగు360 రేటింగ్ 2.75/5