పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ 2 సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ వివాదంలో మోహన్‌లాల్ క్షమాపణలు చెప్పడంతో మొత్తం సినిమా యూనిట్, సెన్సార్ బోర్డ్ కూడా డిఫెన్స్ లో పడింది. ఇలాంటి వివాదస్పద కంటెంట్ వున్న సినిమాకి సెన్సార్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు దర్శకుడు పృథ్వీరాజ్ ఒక పొలిటికల్ ఎజెండాతోనే సినిమాని తీశాడనే విమర్శలు వస్తున్నాయి.
కాగా ఈ వివాదంలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ”తెర వెనక ఏం జరిగిందో నాకు తెలుసు. నా బిడ్డని అన్యాయంగా నిందిస్తున్నారు. మోహన్‌లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని చెప్పలేదు. ఇప్పుడు ఆయనకు, నిర్మాతలకు తెలియకుండా కొందరు నా కుమారుడిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని రాసుకొచ్చారు.
అంతేకాదు ఈ సినిమాలో వివాదం వుంటే ఇందులోభాగమైన అందరికీ బాధ్యత ఉంటుందని, చిత్రీకరణ సమయంలో అందరూ ఉన్నారని, అందరి ఆమోదంతోనే చిత్రం తెరకెక్కిందని, కానీ సినిమా విడుదలయ్యాక పృథ్వీరాజ్ మాత్రమే జవాబుదారీ ఎలా అవుతాడు? ప్రశ్నించారు మల్లిక.
మోహన్ లాల్ కి తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించారంటూ వస్తోన్న వార్తలు వచ్చాయి. దీనిపై మల్లిక స్పందించారు. ఇందులో నిజం లేదు. ఆయన కూడా సినిమాను చూశారు. సెన్సార్ సర్టిఫికేట్ పొందిన అనంతరమే సినిమా విడుదల అయ్యింది’ అని చెప్పుకొచ్చారు.
లూసిఫర్ కేరళ రాజకీయ నేపధ్యంలో వచ్చిన సినిమా. సెకండ్ పార్ట్ లో ఓ మత ఘర్షణని ప్రధానంగా చిత్రీకరించాడు దర్శకుడు. అందులో పాత్రలకు పెట్టిన పేర్లు నిజ జీవితంలో కొందరికి ఆపాదించేలా వున్నాయి. ఓ సన్నివేశంలో హింస శ్రుతి మించిపోయింది. ఓ గర్బిణీ స్త్రీ పై జరిగిన అత్యాచారాన్ని చిత్రీకరించిన తీరు దారుణంగా వుంటుంది. నిజానికి ఈ ఇలాంటి సీన్ సెన్సార్ ని దాటి ఎలా వచ్చిందనేది అర్ధం కావడం లేదు. ఏదేమైనా ఒక సినిమా కంటెంట్ పై వచ్చే అన్ని విమర్శలు. వివాదాలకు క్రియేటర్ గా దర్శకుడే సమాధానం చెప్పాల్సి వుంటుంది.