1994 విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’ హాలీవుడ్ లో ఓ క్లాసిక్. రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కి కూడా ‘ఫారెస్ట్ గంప్’ చాలా ఇష్టం. ఎప్పటి నుండో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని అమీర్ కోరిక. ఎట్టకేలకు తన ప్రొడక్షన్ లో అద్వైత్ చందన్ దర్శకుడిగా ‘లాల్ సింగ్ చడ్డా’ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఇందులో నాగ చైతన్య ఓ కీలక పాత్రలో కనిపించడం ఇక్కడ ప్రేక్షకులని ఆకర్షించిన మరో అంశం. చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ స్టార్లు ప్రచారంలో భాగమయ్యారు. మరీ హాలీవుడ్ క్లాసిక్ అమీర్ కి ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది ? ఫారెస్ట్ గంప్ లోని మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యిందా లేదో వివరంగా చూద్దాం.
లాల్ సింగ్ చడ్డా (అమీర్ ఖాన్) పంజాబ్ లో ఒక వ్యవసాయ క్షేత్రంలో తన తల్లితో కలసి జీవిస్తుంటాడు. లాల్ ఐక్యూ లెవల్స్ తక్కువ. అంటే,.. స్వాతిముత్యం టైపన్నమాట. బాల్యం సరిగ్గా నడవలేని లాల్.. కాళ్ళకి ఇనుప గొట్టాలని తగిలించుకొని నడుస్తుంటాడు. కానీ ఒక సమయంలో అతడి జీవితంలో అద్భుతం జరుగుతుంది. అకస్మాత్తుగా పరుగందుకొని గాలి కంటే వేగంగా పరుగుపెడతాడు. రూప డిసౌజా (కరీనా కపూర్) లాల్ బాల్య స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుకుంటారు. చిన్నప్పటి నుండి రూప అంటే లాల్ కి ఇష్టం. ”నన్ను పెళ్లి చేసుకుంటావా ?” అని రూపని అడుగుతుంటాడు లాల్. రూపకి కూడా లాల్ అంటే ఒక స్నేహితుడిగా ఇష్టం. రూప తండ్రి కేవలం పది రుపాయిల కోసం భార్యని చంపేస్తాడు. ఆ క్షణమే తనని బాగా డబ్బులు వచ్చేలా చేయమని దేవుడ్ని కోరుకుంటుంది రూప. లాల్ , రూప ఇద్దరూ ఢిల్లీ వచ్చి కాలేజ్ లో చేరుతారు. కాలేజీ పూర్తయిన తర్వాత లాల్ ఆర్మీలో చేరుతాడు. రూప హీరోయిన్ కావాలని ముంబై చేరుకుంటుంది. ఆర్మీలో లాల్ కి బాలరాజు (నాగచైతన్య ) పరిచయం అవుతాడు. బాలరాజు వంశీకులు దర్జీలు. చెడ్డి బనియన్లు కుట్టడం, వాటితో వ్యాపరం చేయడం అంటే బాలరాజుకి చాలా ఇష్టం. ఆర్మీ నుండి రిటైరైన తర్వాత అదే వ్యాపారం చేస్తానని లాల్ తో చెబుతాడు బాలరాజు. లాల్ ని పార్ట్ నర్ గా చేసుకునే ప్లాన్ కూడా చెబుతాడు. ఇంతలో యుద్ధం వస్తుంది. బాలరాజు యుద్ధంలో చనిపోతాడు. తర్వాత లాల్ ఏం చేశాడు ? హీరోయిన్ కావాలని కలలుకన్న రూప హీరోయిన్ అయ్యిందా ? మళ్ళీ లాల్ దగ్గరికి వచ్చిందా ? అనేది మిగతా కథ.
‘ఫారెస్ట్ గంప్’.. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్ వున్న సగటు సినిమా కథ కాదు. ‘ఫారెస్ట్ గంప్’ క్యారెక్టర్ ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒక దేశ చరిత్రలోని కీలక ఘట్టాలు ఆవిష్కరించాడు దర్శకుడు రాబర్ట్ జెమెకిస్. ఇది ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చింది. స్వాతిముత్యం లాంటి ‘ఫారెస్ట్ గంప్’ క్యారెక్టర్ తో సమాజం, సరిహద్దులు, యుద్ధాలు, ప్రేమ, ఫిలాసఫీని ఆవిష్కరించాడు జెమెకిస్. సినిమాని ప్రేమించే వారికి ‘ఫారెస్ట్ గంప్’ పిచ్చిగా నచ్చేస్తుంది. అమీర్ ఖాన్ కూడా సినిమా పిచ్చోడే. అందుకే తన లైబ్రరీలో ‘ఫారెస్ట్ గంప్’ వుండాలనుకున్నాడు. ఎలాంటి కమర్షియల్ లెక్కలేసుకోకుండా లాల్ సింగ్ చడ్డాని ప్రజంట్ చేశాడు.
అయితే ఇలాంటి సినిమాలకి ప్రేక్షకులని ప్రిపేర్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రేక్షకుడికి ఒక ఎమోషనల్ కనెక్షన్ అవసరం. ఇందులో ఎమోషనల్ కనెక్షన్ లాల్ పాత్రే. అతని ప్రయాణమే. ఆ ప్రయాణంలో కథని వెతుక్కునే పరిస్థితి ప్రేక్షకుడిలో కలుగుతుంది. అసలు దేని గురించి ఇదంతా జరుగుతుందని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇండియా వరల్డ్ కప్ గెలవడం, ఎమర్జన్సీ ఎత్తివేత, ఇందిరా గాంధీ హత్య, సిక్కుల ఊచకోత, బాబ్రీ మసీదు కూల్చివేత, కార్గిల్ వార్, ముంబై ఎటాక్, ఇలా చరిత్రలోని సంఘటనలు ఆవిష్కృత మౌతుంటాయి. ‘ఫారెస్ట్ గంప్’లోని మ్యాజిక్ కూడా అమెరికా చరిత్రని ఆపాత్ర తో సజీవ సాక్ష్యంగా చూపించడమే. ఈ పాయింట్ విషయంలో ప్రేక్షకుడికి ముందే ఒక ప్రిపరేషన్ కావాలి. లేదంటే.. ఓపిక నశించే వ్యవహరంగా మారే పరిస్థితి కూడా వుంది.
కథలో ఉన్నంత డ్రామా ప్రయాణంలో వుండదు. అందుకే ఈ చిత్రంలోని సన్నివేషాలు అలా సాగుతూనే వుంటాయి. అయితే బాలరాజుగా నాగచైనత్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత లాల్, బాల కలసిన తర్వాత వచ్చే వార్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ ప్రయాణానికి భీజం వేస్తుంది. హీరోయిన్ అవకాశాలు కోసం అడ్డదారులు తొక్కి చివరికి జీవితంతో విసిగిపోయిన రూప పాత్ర సెకండ్ హాఫ్ లోఎమోషనల్ జర్నీకి లీడ్ ఇస్తుంది. రూప పాత్రతో అండర్ వరల్డ్ ని ప్రజంట్ చేసిన విధానం కూడా బావుంటుంది.
అయితే ఫారెస్ట్ గంప్ క్లాసిక్ గా నిలవడానికి చాలా కారణాలు వున్నాయి. 1994 లో వచ్చిన సినిమా అది. అప్పటి ప్రేక్షకుల మూడ్ వేరు. మూడు గంటల సినిమాని చూడటానికి కూడా ఎలాంటి ఫిర్యాదులు ఉండేవి కాదు. అయితే అప్పటి స్క్రీన్ ప్లే ని 2022లో ప్రజంట్ చేస్తున్నపుడు నిడివి, టెక్నిక్ విషయంలో మార్పులు చేస్తుంటే బావుండేది. ఎలాంటి మార్పులు లేకుండా అదే స్క్రీన్ ప్లేని ఫాలో కావడం లాల్ సింగ్ చడ్డాకి ఒక లోపం.
అలాగే ఇందులో చూపించిన సంఘటనలు వెనుక కారణాలు వెదుక్కుంటే ఒక ఫీలాసఫీ కూడా దొరుకుతుంది. దేశంలోని అల్లర్లుని మలేరియాతో పోల్చడం, మహమ్మద్ పాత్ర ద్వార మానవ జీవితానికి సరైన విద్య కావాలని చెప్పించడం, బుల్లెట్ ని తేనేటీగతో పోల్చడం, డబ్బు ఫేమ్ వెనుక పరిగెత్తిన రూప పాత్ర ప్రశాంతతని వెదుక్కోవడం, లాల్ ఒకే చోట ఆగిపోకుండా నాలుగేళ్ళు పాటుపరిగెత్తడం, రూప సమాధి వద్ద కూర్చుని అసలు దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడని లాల్ ప్రశ్నించుకోవడం.. ఇదంతా డీప్ ఫిలాసఫీనే.
అమీర్ ఖాన్ నటన గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాల్ పాత్రలో ఇమిడిపోయాడు అమీర్. అమాయకత్వం నటించడం అంత తేలిక కాదు. కొంచెం తేడా జరిగిన లైట్ తీసుకునే ప్రమాదం వుంది. కానీ లాల్ పాత్ర గ్రాఫ్ ని అద్భుతంగా పండించాడు. లాల్ ఎమోషనల్ జర్నీ కనెక్టింగా వుంటుంది. రూప పాత్రని అందంగా చేసింది కరీనా కపూర్. ఆమె పాత్రలో కూడా చాలా ప్రయాణం వుంది. నాగచైనత్య ఎప్పటికీ గుర్తించుకునే పాత్ర బాలరాజు. ఆ పాత్రకి వందశాతం న్యాయం చేశాడు. మహమ్మద్ పాత్రలో కనిపించని నటుడు కూడా ఆకట్టుకుంటాడు. మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ ప్రదేశాల్లో షూటింగ్ జరిగింది. కెమరాపనితనం చక్కగా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా వుండాల్సింది. నేపధ్య సంగీతం బావుంది. వున్నతమైన నిర్మాణ విలువలు కనిపించాయి.
ఫారెస్ట్ గంప్ ని రీమేక్ చేయాలనుకునే ఆలోచనే ఒక సాహసం. అయితే సాహసాలు అమీర్ ఖాన్ కి కొత్తకాదు. అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ ఒక కమర్షియల్ సినిమా కోసం తాపత్రయం పడే అవసరం లేదు. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ కూడా గుర్తుంచుకునే సినిమాలు కోసమే అమీర్ ప్రయాణం. లాల్ సింగ్ చడ్డా కూడా అమీర్ ఖాన్ కెరీర్ లో గుర్తుపెట్టుకునే చిత్రమే.