‘ధోబీ ఘాట్’ లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత ‘లాపతా లేడీస్’ కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విశేషమైన ప్రసంశలు అందుకుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైయిందీ సినిమా. దాదాపు అందరూ కొత్తవారితో తీసిన ‘లాపతా లేడీస్’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? ‘లాపతా లేడీస్’ కథలో వున్న విలక్షణత ఏమిటి?
అది 2001. నిర్మల్ ప్రదేశ్. దీపక్ (స్పర్శ్ శ్రీవాస్తవ్) ఫూల్ కుమారి(నితాన్షి గోయెల్) పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు. అమ్మాయి ఇంటి దగ్గర పెళ్లి తంతు పూర్తవుతుంది. తన ఇంటికి తీసుకెళ్లడానికి భార్యతో పాటు రైలెక్కుతాడు దీపక్. ఆ బోగిలో మరో రెండు కొత్త జంటలు వుంటాయి. ఆ కొత్త పెళ్లి కూతుళ్ళంతా ఆ ప్రాంతం ఆచారం ప్రకారం ఒకటే వస్త్రధారణతో, ముఖం కనిపించకుండా ముసుగుతో వుంటారు. ఓ అర్ధరాత్రి దీపక్ దిగే స్టేషన్ వస్తుంది. కొత్త పెళ్లి కూతురితో కలసి బ్యాండ్ మేళంతో సహా ఊరేగింపుగా ఇంటికి చేరుకుంటాడు దీపక్. ఇంటికి చేరుకున్న పెళ్లి కూతురుని హరతివ్వడానికి ముసుగు తీయమని కోరుతుంది దీపక్ తల్లి. పెళ్లి కూతురు ముసుగు తీసిన తర్వాత అంతా షాక్ అవుతారు. కారణం.. దీపక్ తో పాటు వచ్చింది ఫూల్ కుమారి కాదు.. పుష్ప రాణి (ప్రతిభా రంతా). ముసుగు వుండటంతో పొరపాటునా వేరే పెళ్లికూతురుని ట్రైన్ నుంచి తీసుకోచ్చేశాడు దీపక్. తర్వాత ఏం జరిగింది? అసలు దీపక్ తో పుష్ప రాణి అంత గుడ్డిగా ఎలా వచ్చేసింది? ఫూల్ కుమారి పరిస్థితి ఏమిటి? దారితప్పిన ఈ జంటలు చివరికి ఎలాంటి గమ్యాలని చేరాయి? అనేది తక్కిన కథ.
బాలీవుడ్ కథల సంక్షోభంలో వుంది. అక్కడి ఫిల్మ్ మేకర్స్ చెబుతున్న కథలు ప్రేక్షకులు పట్టడం లేదు. ఒకప్పుడు స్థానిక సాంఘిక పరిస్థితులు ఒడిసిపట్టుకొని ప్రేక్షకులని హత్తుకునే కథలని చెప్పే బాలీవుడ్.. ఇప్పుడా పట్టుని కోల్పోయింది. ఇప్పుడు అక్కడి ఫిల్మ్ మేకర్స్ చెబుతున్న లార్జర్ దెన్ లైఫ్ కథల్లో ఆత్మ వుండటం లేదు. సామాజిక కథలు కూడా తెలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కిరణ్ రావు తీసిన ఈ ‘లాపతా లేడీస్’ ఆ పరిశ్రమకు గొప్ప ఊరటనే చెప్పాలి. సింపుల్ కథలే సూపర్ గా ఉంటాయని చెప్పడానికి మరో నిదర్శనం లాంటి సినిమా ఇది. పితృస్వామ్యం ఆధిపత్యం చెలాయిస్తున్న ఓ సమాజంలో ఇద్దరు సాధారణమైన అమ్మాయిల చుట్టూ జరిగే ఈ కథ కొన్ని చోట్ల నవ్విపిస్తుంది, ఇంకొన్ని చోట్ల గుండెబరువెక్కిస్తుంది, చాలా చోట్ల ఆలోచనల్లో పడేస్తుంది.
ఫూల్ కుమారిని అత్తారింటికి సాగనంపే సన్నివేశంతో కథ మొదలౌతుంది. అక్కడి నుంచి వారు చేసిన ప్రయాణం ఆ ప్రాంతం స్థితిగతులని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. రైలు ఎక్కిన తర్వాత అక్కడే జరిగే సంభాషణలు నవ్విస్తూనే చురకలంటిస్తాయి. ఇక పెళ్లి కూతుళ్ళు దారితప్పిన తర్వాత వచ్చే వచ్చే సన్నివేశాలు కథని రక్తికట్టిస్తాయి. పుష్ప తన అత్తవారిల్లు ఎక్కడో తెలియదని చెబుతుంది. దాని వెనుక ఓ ట్విస్ట్ వుంటుంది. ఇక అమాయకురాలై దీపక్ భార్య ఫూల్ కు నిజంగానే అత్తాగారి ఊరు పేరు తెలీదు. ఈ ఇద్దరి ప్రయాణం చివరి వరకూ ఆసక్తిగా చూపించడంలో దర్శకురాలు పైచేయి సాధించింది.
సన్నివేశాల అల్లిక, సంభాషణలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. పుష్ప పాత్ర రూపంలో స్త్రీ సాధికారత గురించి దర్శకురాలు చెప్పే కొన్ని అంశాలు అదేదో సందేశంలా కాకుండా కథలోనే ఇమిడాయి. దీపక్ తల్లి వండిన వంటని తిన్న పుష్ప ‘చాలా బావుంది’అని కితాబిస్తుంది. ‘వంటని మెచ్చుకుంటారా?!’అని దీపిక్ తల్లి నవ్వే నవ్వు ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది. అటు ఫూల్ కుమారి తను దిగిన అదే స్టేషన్ లో ఓ కాకా హోటెల్లో వంటకి కుదురుకుంటుంది. తనకు జీతంగా ఇచ్చిన డబ్బుని కొంగుకి ముడి వేసుకున్న దృశ్యం చుస్తున్నప్పుడు ప్రేక్షకుడికి ఆనందంతో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఈ రెండు సన్నివేశాలతో దర్శకురాలు అంతర్లీనంగా చెప్పే సందేశం మహిళలకు గొప్ప మనో ధైర్యాన్ని ఇస్తాయి. ఇలాంటి చెప్పుకోదగ్గ సన్నివేశాలు చాలానే వున్నాయి.
అయితే ఈ సినిమా నడకలో కొన్ని లోటుపాటు కనిపిస్తాయి. వేగంగా మొదలైన కథలో తర్వాత కథనం కాస్త మందగిస్తుంది. పుష్ప పాత్ర చుట్టూ అల్లుకున్న కొంత సస్పెన్స్ డ్రామా బావున్నప్పటికీ ఒక దశలో సాగదీతగా అనిపిస్తుంది. వాటికి ఇంకాస్త పదునుగా చెప్పుంటే బావుండేది. ఇందులోని పాత్రల అమాయకత్వమే బలాన్ని తీసుకొస్తుంది. అయితే కొన్ని చోట్ల మరీ ఇంత అమాయకంగా ఉంటారా? అనే లాజిక్ కూడా తొలుస్తుంటుంది.
నటులంతా దాదాపు కొత్తవారే. అయితే కథ మొదలైన కాసేపటికే పాత్రలుగా గుర్తుండిపోతారు. ఫూల్ కుమారి గా చేసిన నితాన్షి గోయెల్ అమాయకత్వం కట్టిపడేస్తుంది. దీపక్ పాత్రని ఎంతో సహజంగా చేశాడు స్పర్శ్ శ్రీవాస్తవ్. ఫూల్ కోసం తను పడే తపన హత్తుకునేలా వుంటుంది. పుష్ప రాణిగా ప్రతిభా రంతా తెలివైన అమ్మాయిగా కనిపించింది. ఫూల్ జాడ కోసం ఆమె చేసిన ప్రయత్నం ఆకట్టుకునేలా వుంటుంది. ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్‌గా చేసిన రవికిషన్ మరో ఆకర్షణ. విలన్ లాంటి హీరో పాత్ర. క్లైమాక్స్ లో కట్టిపడేస్తాడు. తనకి ఇచ్చిన పాన్ నమిలే మ్యానరిజం బాగా కుదిరింది. మిగతా నటీనటులంతా కథలో ఇమిడిపోయారు.
రామ్ సంపత్ సంగీతం ఈ సినిమాకి మరో ఆకర్షణ. సజ్ని పాటలో దీపిక్, ఫూల్ ఎడబాటుని చక్కగా చిత్రీకరించింది. చివర్లో శ్రేయా ఘోషల్ పాడిన ధీమే ధీమే పాట టైటిల్స్ పూర్తయిన తర్వాత మరోసారి వినాలనిపించేలా వుంటుంది. కెమరాపనితనం, ప్రొడక్షన్ డిజైన్ కథలోని ఆత్మని పట్టుకునేలా వున్నాయి. హిందీ చక్కగా అర్ధమైతే దాదాపు అన్ని డైలాగ్స్ ని ఆస్వాదించవచ్చు. నవ్విస్తూ, ఆలోచనల్లో పడేసే ఈ సినిమా వీలు చేసుకుని చూడాల్సిందే.