వెలగపూడిలో వేగంగా కొనసాగిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో ఈ రోజు దేవేందర్ అనే కార్మికుడు ప్రమాదంలో దుర్మరణం పాలవడం విషాదం నింపింది. పైగా గతంలోనూ ఇలాగే మరో కార్మికుడు మరణించినట్టు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్మాణంలో అందునా అంతర్జాతీయ ప్రతిష్ట పొందిన సంస్థ ఆధ్వర్యంలో ఇలాటి ఘటనలు జరగడం మరింత తీవ్రమైన విషయం. దీనిపై లోతైన విచారణ జరిపి పనివత్తిడి, పని పరిస్థితులు మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఎల్ అండ్ టి రోజుకు పది గంటలు పనిచేయిస్తున్నట్టు 243 నుంచి 293 వరకూ మాత్రమే వేతనం ఇస్తున్నట్టు కార్మికులు చెబుతున్నారు.ే అది కూడా ఎప్పటికప్పుడు ఇవ్వకుండా పెండింగులో పెడుతున్నట్టు ఫిర్యాదులున్నాయి. కార్మికుడు మృతి చెందిన ఘటనపై ఆందోళన చేస్తున్నందుకు వామపక్ష నేతలను అరెస్టు చేయడం అక్కడ పోలీసులను ప్రయోగించడం మరింత ఉద్రిక్తత పెంచింది. ఇలాటి ఘటన జరిగినప్పుడు సంయమనం ప్రదర్శించి తక్షణ సహాయం కోసం ముందుకు రావాలి గాని వివాదం పెంచడం మంచిది కాదని స్థానికులు అంటున్నారు. రానురాను ఒత్తిడి పెరుగుతుంది గనక కార్మికుల భద్రతకు కట్టుదిట్టాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.రేపు ఇక్కడ ముందుముందు జరిగే వాణిజ్య నిర్మాణాలలో ప్రైవేటు కాంట్రాక్టర్లు కనీస నిబంధనలు పాటించాలన్నా ే ప్రభుత్వం వైపునుంచే పొరబాట్లు వుండకుండా చూసుకోవాలి.. లేదంటే సంఘర్షణలు పెరుగుతాయని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.