ఈనాడు గ్రూప్ నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా టాప్ రేసులో వుంటుంది. ఈ సంస్థ ‘ఈటీవీ విన్’ పేరుతో ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పటివరకూ 90s బయోపిక్ తప్పితే మరో క్రేజీ పాపులర్ ప్రాజెక్ట్ లేదు. దాదాపుగా అన్నీ చిన్న సినిమాలే చేస్తున్నారు. ఏ ప్రాజెక్ట్ కి కూడా పెద్ద స్టార్ వాల్యు వుండటం లేదు. నిజానికి అందులో వస్తున్న సినిమాల గురించి మీడియా సర్కిల్స్ లో కూడా బజ్ ఉండటం లేదు.
ఇటీవలే అక్కడ శశి మధనం అనే ఓ వెబ్ సిరిస్ వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు ఈ వెబ్ సిరిస్ ఊసే లేదు. కనీసం రివ్యూలు కూడా రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సంస్థలో ప్రముఖ వ్యక్తి.. ‘ప్లీజ్.. మా ఓటీటీలో వస్తున్న కంటెంట్ పై రివ్యూలు ఇవ్వండి. మంచి చెడు ఏదైనా తీసుకుంటాం. కానీ అందరూ రివ్యూలు కవర్ చేయండి’అని కోరారు.
ఈనాడు అంటే మీడియాలో అగ్రగామి. అలాంటి సంస్థ ఏర్పాటు చేసిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కంటెంట్ గురించి మీడియాలోనే పెద్ద బజ్ లేకోవడం విచిత్రమే. అయితే దీనికి చాలా కారణాలు వున్నాయి. ముఖ్యంగా అందులో వస్తున్న దాదాపు సినిమాలన్నీ కొత్తవారితో తీసినవే. అందులో చాలా వరకూ ఎలాంటి బజ్ లేకుండా వస్తున్నాయి. కనీసం రివ్యూ ఇవ్వాలన్నా ఉత్సాహం కూడా ఎవరికీ వుండటం లేదు.
సినిమాలకి ఎలాంటి స్టార్ ఎట్రాక్షన్ వుండటం లేదు. ఈ మాట చెబితే కంటెంటే మాకు పెద్ద స్టార్ అని అంటున్నారు. ఇది స్టేట్మెంట్ వరకూ బాగానే వుంటుంది కానీ ఎంత కంటెంట్ వున్నా, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కనీసం తెలిసిన మొహలు వుండాలి. పది సినిమాలు కొత్తవారితో చేసి కనీసం ఒక్క సినిమా అయినా కాస్త స్టార్ ఎట్రాక్షన్ వున్న ప్రాజెక్ట్ చేస్తే బజ్ వుంటుంది.
ప్రస్తుతం ఇరవై సినిమాలు చేస్తున్నామని ప్రకటించింది ఈవిన్. ఈ ఇరవై సినిమాలకి దర్శకులు కొత్తవారే. కొత్తవారిని ప్రోత్సహించడం మంచిదే కానీ.. ఏకంగా ఇరవై సినిమాలని కొత్తవారి చేతిలో పెట్టడం అంటే.. బడ్జెట్ విషయంలో ఎంత రాజీపడుతున్నారో అర్ధమౌతోంది.
ఇదే సమయంలో కొత్తకథలు వుంటే చెప్పండి, మేము నిర్మిస్తామని ఆఫర్ చేస్తోంది ఈవిన్. అయితే సినిమా సర్కిల్స్ లో ఈవిన్ బడ్జెట్ లెక్కలు గురించి తెలిసి ఎవరూ కథ చెప్పడానికి ఆసక్తి చూపడం లేదు. ఎలాంటి కథ చెప్పినా వారు ఇచ్చిన బడ్జెట్ లోనే తీయాలనేది మొదటి కండీషన్. ఈ కండీషన్ కారణంగా యూనిక్ కథలు సహజంగానే అటు వెళ్ళడం లేదు.
ఇక మీడియా కవరేజ్ విషయానికి వస్తే.. ఆ సంస్థ చేతిలోనే ఈనాడు పేపర్, ఈటీవీ లాంటి పాపులర్ ఛానల్స్ వున్నాయి. అయితే అక్కడ కూడా వారికి కంటెంట్ ప్రాధాన్యత వుండటం లేదు. సదరు ఓటీటీ లో వచ్చే సినిమా గురించి ఏదైనా ఐటెం వస్తే.. పేపర్లో ఏదో మూలన కనీకనిపించనట్లు న్యూస్ వేస్తారు. వాళ్ళకే ప్రయారిటీ లేనప్పుడు మిగతా ఛానల్స్ పట్టించుకుంటాయనడంలో అర్ధం లేదు. ఏదేమైనా కంటెంట్ తో పాటు మంచి స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ తో ప్రాజెక్ట్స్ చేస్తేనే ఆటోమేటిక్ బజ్ వస్తుందనేది గ్రహించాలి.