తెలుగులో ఇప్పటి వరకూ బిగ్ బాస్ సీజన్లు 4 నడిచాయి. అన్నీ దాదాపుగా హిట్టే. ఇప్పుడు 5వ సీజన్ మొదలు కాబోతోంది. జులై నుంచి బిగ్ బాస్ 5ని ప్రారభించాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. అందుకు సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది. అయితే బిగ్ బాస్ కి ప్రతీసారీ సెలబ్రెటీల కొరత వేధిస్తోంది. దొరికిన వాళ్లతోనే, సర్దుకుపోవడం `మా`కి అలవాటుగా మారింది. ఈసారి మాత్రం ఎలాగైనా పేరున్న సెలబ్రెటీలను వెదికి పట్టుకోవాలని.. టీమ్ భావించింది. అందుకు తగినట్టుగానే… ఓ సాలిడ్ లిస్టుని ప్రిపేర్ చేసింది. అందులో దాదాపు 30 మంది సెలబ్రెటీలు ఉన్నారు. వాళ్లతో 16 మందితో ఫైనల్ లిస్టుని తయారు చేయాలన్నది ప్రపోజల్. ఇటీవల ఇంటర్వ్యూలూ మొదలయ్యాయి. అయితే ఈసారి కూడా బిగ్ బాస్ లో కనిపించడానికి సెలబ్రెటీలు అంత ఉత్సాహం చూపించడం లేదని తెలుస్తోంది.
తొలి సినిమాతోనే గ్లామరెస్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుని, ఆ తరవాత…. ఆఫర్లు దండిగా అందుకున్న ఓ తారని బిగ్ బాస్ లోకి తీసుకుందామని ప్రయత్నించారు. ఆమెను సంప్రదిస్తే.. ఏమాత్రం మొహమాటం లేకుండా `నో` చెప్పిందట. భారీ పారితోషికం ఇస్తానన్నా.. కరగలేదట. అలాగని ఆమె చేతిలో సినిమాలున్నాయా, అంటే అదీ లేదు. దాదాపుగా ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. `ఈ సీజన్లో వీళ్లుంటే బాగుంటుంది` అని భావించిన వాళ్లంతా.. ఏమాత్రం ఆలోచించకుండా `నో` చెప్పేస్తున్నార్ట. దాంతో.. ఈ సీజన్లోనూ సెలబ్రెటీల కొరత ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బిగ్ బాస్ అంటే ఉత్సాహం చూపించకపోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది క్వారంటైన్ నిబంధన. ఈ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినవాళ్లంతా…. తప్పని సరిగా 14 రోజుల పాటు హోం క్వారెంటైన్ లో ఉండాలి. ఆ తరవాత.. షో కోసం 100 రోజులు వెచ్చించాలి. అంటే… అటూ ఇటూగా 4 నెలలకు వ్యక్తిగత జీవితానికి దూరం ఉండాలి. షోలో ఉన్నప్పుడు కరోనా వస్తే.. అది మరో తలనొప్పి. అందుకే… బిగ్ బాస్ అంటే పెద్దగా ఇష్టపడడం లేదని టాక్. అంతే కాదు… బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ కి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. వాళ్లని టాలీవుడ్ పట్టించుకున్న పాపాన పోలేదు. బిగ్ బాస్ లో మెరిసి, వెండి తెర కు ఎంట్రీ తెచ్చుకుందాం అనుకుంటే అది అత్యాసే అన్నది అర్థమైపోయింది. అందుకే… సెలబ్రెటీలెవరూ పెద్దగా బిగ్ బాస్ వైపు చూడడం లేదు. అంటే.. ఈసారీ అరకొర సెలబ్రెటీలతోనే సర్దుకుపోవాలన్నమాట. అలాగైతే.. సీజన్ 5 భారంగా నడవడం ఖాయం.