కమెడియన్లు మళ్ళీ బిజీ అవుతున్నారు. హాస్య నటులు హీరోలు గా చేసే ట్రెండ్ మళ్ళీ మొదలైయింది. గతంలో అలీ, సునీల్, వేణు మాధవ్, కృష్ణ భగవాన్… ఇలా చెప్పుకుంటూపోతే బోలెడుమంది కమెడియన్లు హీరోలుగా మారారు. హాస్య ప్రధాన కథలలో అలరించారు. ఎందుకో ఈ ట్రెండ్ లో కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ పోకడ ఊపందుకొంది.
‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరకీ దగ్గరయ్యాడు ప్రియదర్శి. అందులోని తన కామెడీ టైమింగ్ కొత్తగా అనిపించింది. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు చేశాడు. ‘మల్లేశం’తో కథని నడిపే పాత్రతో అలరించాడు. ‘బలగం’ సినిమా కూడా తనకి మంచి పేరుతీసుకొచ్చింది. ‘ఓ0 భీమ్ భుష్’ తో పాటు ‘సేవ్ టైగర్స్’ వెబ్ సిరిస్ తో మంచి జోష్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన హీరోగా డార్లింగ్ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.
సునీల్ కూడా మళ్ళీ ఫాం లోకి వచ్చారు. ఒక పక్క సీరియస్ పాత్రలతో పాటు కామెడీ రోల్స్ లో కూడా అదరగొడుతున్నారు. జైలర్ సినిమా సునీల్ కు తమిళ్ లో కూడా మంచి రీచ్ తీసుకొచ్చింది. ఆయన ప్రధాన పాత్రలో తెలుగులో కొన్ని సినిమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
‘పొలిమేర’ సినిమాతో సత్యం రాజేష్ కెరీర్ కి కొత్త ఆశలు చిగురించాయి. ఆ సినిమా ఓటీటీలో వచ్చింది. పొలిమేర 2 థియేటర్లలోకి వచ్చి నిర్మాతలకు లాభాలు మిగిల్చింది. నిజానికి తను మంచి టైమింగ్ వున్న ఆర్టిస్ట్. కామెడీతో పాటు అన్నీ భావాలు పలికించగలడు. అయితే సరైన విజయాలు లేక డీలా పడ్డ అతని కెరీర్ కి పొలిమేర ఫ్రాంచైజ్ జోష్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన హీరోగా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ మధ్య టెనెంట్ అనే సినిమా వచ్చింది. ఇంకొన్ని నిర్మాణ దశలో వున్నాయి.
వెన్నెల కిషోర్ కెరీర్ కూడా మంచి జోరులో వుంది. పెద్ద సినిమాల్లో కామెడీ పాత్రలకు ఆయన ఫస్ట్ ఛాయిస్. మరోపక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యే ఛార్లీ సినిమా చేశాడు. ఈ సినిమా థియేటర్స్ లో సరిగ్గా ఆడకపోయినప్పటికీ ఓటీటీ రేటు కిట్టుబాటైయిందని తెలుస్తోంది.
టాలీవుడ్ లో బిజీ కమెడియన్ లో సత్య ఒకరు. సత్య కామెడీతో సేవ్ అయిన సినిమాలు వున్నాయి. రంగబలి ఫస్ట్ హాఫ్ బావుందని టాక్ రావడానికి కారణం సత్య టైమింగ్. ఇటీవలే విడుదలైన గీతాంజలి 2 కి కాస్తో కూస్తో పాజిటివ్ టాక్ వచ్చిందంటే కారణం సత్యనే. తను హీరోగా వచ్చిన వివాహభోజనంబు ఓటీటీలో హిట్. ఇప్పుడు సత్య కోసం కథలు రాస్తున్న వారి సంఖ్య ఎక్కువే.
సప్తగిరి ఇప్పటికే హీరోగా టర్న్ తీసుకున్నాడు. జయాపజయాలు పక్కన పెడితే హీరోగా చేయడానికే మొగ్గు చూపుతున్నాడు. జబర్దస్త్ వేదికగా వచ్చిన హాస్యనటులు కూడా ఫుల్ బిజీగా వున్నారు. వేణు దర్శకుడిగా మారాడు. బలగంతో విజయాన్ని అందుకొని నానితో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ధనరాజ్ కూడా దర్శకత్వంపై దృష్టిపెట్టాడు. సముద్రఖని ప్రధాన పాత్రలో ‘రామం రాఘవం’ రూపొందిస్తున్నారు. శకలక శంకర్, సుడిగాలి సుదీర్ హీరోలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. హైపర్ అది పెద్ద సినిమాల్లో కామెడీ పాత్రల్లో మెరుస్తున్నాడు. అభినవ్ గోమటం ఇటీవల ‘డియర్ దొంగ’గా మెరిశాడు. ఓటీటీలో కొన్ని కథలు ఆయన కోసం రెడీ అవుతున్నాయి.
మొత్తానికి ఇప్పుడు తెలుగు హాస్యనటులు మళ్ళీ బిజీ అయ్యారు. వాళ్ళ డేట్స్, పారితోషకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇందులో చాలా మంది నటులు చిన్న సినిమాలకి అందుబాటులో లేని పరిస్థితి కూడా వుంది.