తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న నియోజవకర్గాల్లో ఒక్కటి మాత్రమే గ్రేటర్ పరిధిలో ఉంది. అది కూడా కూకట్ పల్లి కావడంతో ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెడతామని గట్టి నమ్మకంతో ఉంది. అయితే జనసేన అభ్యర్థి ముమ్మారడ్డి ప్రేమ్ కుమార్ కు పరిస్థితులు కలసి రావడం లేదు. జనసేన పార్టీకి నిర్మాణం లేదు. పవన్ ఫ్యాన్స్ స్వచ్చందంగా చేస్తున్నప్రచారమే కీలకంగా మారింది. బీజేపీ తరపు నుంచి సహకారం లభించడంలేదు.
నిజానికి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బీేపీ నేత. చివరి క్షణంలో జనసేన పార్టీ లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. కానీ ఆయనకు బీజేపీ క్యాడర్ నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదు. బీజేపీ పోటీ చేయకపోవడంతో చాలా మంది సైలెంట్ అయిపోయారు. కొంత మంది ప్రయత్నం చేస్తున్నా వారి బలం సరిపోవడం లేదు. బీజేపీ రాష్ట్ర నేతలు కూడా కూకట్ పల్లి వైపు చూడటం లేదు. గెలిచే అవకాశం ఉన్న మిత్రపక్ష సీటులో ఓ సారి ప్రచారం చేద్దామన్న ఆలోచన చేయడం లేదు.
బీజేపీ అగ్రనేతల పర్యటనలు ఏవీ ఖరారు కాలేదు. అదే సమయంలో.. పవన్ కల్యాణ్ ప్రచారంపైనా ఇంకా స్పష్టత రాలేదు. ఇంకా ప్రచారానికి పది రోజుల మాత్రమే సమయం ఉంది. పవన్ కనీసం రెండు రోజుల పాటు రోడ్ షో నిర్వహిస్తే..సీన్ అంతా మారిపోతుందని అభ్యర్థి ఆశలు పెట్టుకుంటున్నారు. బీజేపీ అగ్రనేతలతో కలిసి.. పవన్ రోడ్ షో నిర్వహించాలని కోరుకుంటున్నారు. వారు చాన్స్ ఇస్తారో లేదో తెలియక తికమక పడుతున్నారు.
పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు… కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ … చురుకుగా ప్రచారం చేసుకుంటున్నారు. వారికి కాంగ్రెస్ అగ్రనేతలు సహకరిస్తున్నారు. జనసేన పార్టీ అభ్యర్థి మాత్రమే ఒంటరిపోరాటం చేస్తున్నారు.