యువ ముఖ్యమంత్రి అంటే పరుగులు పెట్టి కసితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన అందరూ అనుకున్నారు. 45 ఏళ్ల వయసులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వేగం.. ఆలోచనలు చూసి దేశం అబ్బురపడింది. ప్రజల వద్దకు పాలన.. శ్రమదానం….ఐటీ .. సంక్షేమం.. విజన్ 2020 .. ఆర్థిక సంస్కరణలు ఇలా ఆయన దూకుడుగా వ్యవహరించారు. ప్రజా జీవితాల్లో మార్పులు వచ్చాయి. 47 ఏళ్ల వయసులో సీఎం అయిన జగన్ రెడ్డి అంతే ఉత్సాహంగా పని చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన పదవి కోసం మాత్రమే ప్రజల్లోకి వచ్చారు. తరవాత పూర్తిగా క్వారటైన్ లో ఉండిపోయారు.
ఆయన మూడు సార్లు విదేశీ పర్యటనకు వెళ్తూ .. రెండు సార్లు పూర్తి స్థాయి విహారయాత్రలు. మరోసారి విహారయాత్రలో కాస్త తీరిక చేసుకుని దావోస్లో క్యాంప్ వేశారు. అక్కడ అప్పటికే ఉన్న ప్రతిపాదనలతో ఒప్పందాలు చేసుకుని బాకా ఊదేసుకున్నారు. ఒకే ఒక్క సారి విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టి లక్షల కోట్ల పేరుతో టముకు వేసుకున్నారు. కానీ ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రసిద్ధ కంపెనీల లోగోలు వేసుకుని అన్నింటినీ జగన్ రెడ్డే సృష్టించాడన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఎంత ఘోరం అంటే.. జగన్ రెడ్డి సీఎం కాగానే ఆయన కు చెందిన భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో 51 శాతం వాటా ఉన్న వికాట్ ప్రతినిధులు వచ్చి పెద్ద ఎత్తున విస్తరణ చేపడతామని జగన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఒక్క రూపాయి విస్తరణ కూడా చేపట్టలేదు. ఇక వేరే వాళ్లు వచ్చి పెట్టుబడులు పెడతారా ?
ఏపీలో వచ్చిన పెట్టుబడులు.. కొత్త కంపెనీ ఏమిటంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసుకునే బీ గ్రేడ్ కంపెనీ ఇప్పుడు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు. వేల కోట్ల విలువైన భూముల్ని ధారదత్తం చేశారు. ఇప్పటి వరకూ ఆ కంపెనీ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలేదు కానీ ప్రభుత్వం వైపు నుంచి ప్రజాఆస్తుల్ని రాయించుకుంది.
యువతకు ఉపాధి కోసం కడపలో స్టీల్ ప్లాంట్ అని గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని శంకుస్థాపన చేస్తే.. జగన్ రెడ్డిక్యాన్సిల్ చేశారు. ఇప్పటికి రెండు సార్లు శంకుస్థాపన చేశారు. కానీ ప్రహరిగోడ కూడా కట్టలేదు. అదీ ఆయన సామర్థ్యం. యువముఖ్యమంత్రి అంటే ఇంట్లో ముసుగుతన్ని పడుకోవడమా అని ఆశ్చర్యపోయేలా పని చేసిన ఒకే ఒక్క సీఎం జగన్ రెడ్డి.