తెలంగాణను బంగారు తునకగా మార్చేశామని ఇక వజ్రపు తునక చేయాల్సి ఉందని కేసీఆర్ ప్రచారం చేసుకున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రచార వ్యూహాలు అమలు చేశారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో డ్రోన్ షాట్స్ తీసుకుని విస్తృత ప్రచారం చేసుకున్నారు. ఇది హైదరాబాద వాసులకు నచ్చిది. అందుకే ఓట్లేశారు. మరి మాకేది అభివృద్ధి అని రూరల్ తెలంగాణ ప్రజలు అనుకున్నారు. బీఆర్ఎస్ , కేసీఆర్ ను పెంచి పెద్ద చేసిది తామయితే.. తమను పట్టించుకోలేదన్న కారణంతో వ్యతిరేకంగా ఓట్లేశారు.
తెలంగాణ ఓటర్లలో పోలింగ్ కంటే ముందే మౌత్ టాక్ కాంగ్రెస్ అనే వాదన ఎక్కువగా వినిపించింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా నేరుగా అంగీకరించింది. గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే అని అదేమంత పెద్ద విషయం కాదని కేటీఆర్ సహా అందరూ తేలికగా తీసుకున్నారు. పదేళ్ల పాలనపై అసంతృప్తి ఉంటుందని కానీ తమ పార్టీని కాదనుకోలేరని కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ భావన. భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా మార్పు నినాదం గట్టిగా వినిపించడానికి కారణం కాంగ్రెస్ పై అభిమానం కాదు.. బీఆర్ఎస్ పై కోపం.
ఉద్యమ ఆకాంక్ష నియామకాలు. పదేళ్ల పాటు గ్రూప్స్ పరీక్షలు పెట్టకపోతే.. ఎన్నికలకు ముందు పెట్టిన పరీక్ష పేపర్లు లీకయితే నిరుద్యోగులు తట్టుకుంటారా ?. మహిళలకు ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం లేదు. తాము వచ్చాకే పంటలు పండించుకున్నారన్నట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేసినా… పండింటిన పంటను అమ్ముకునే దగ్గర ప్రభుత్వం పెట్టిన అరిగోస రైతుల కోపాన్ని రెట్టింపు చేసింది. ఇలాంటి అసంతృప్తి దాదాపుగా ప్రతి వర్గంలోనూ ఉంది. ఆ ఫలితం పోలింగ్ లో కనిపించింది.
హైదరాబాద్ ను తిరుగులేని విధంగా అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఆ ఫలితాలు తమకు అందడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో పెరిగిపోయింది. అది ఓట్ల రూపంలో బయటపడింది.