ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇళ్ల మీద పడి కావాలనుకునేవాళ్లను కొట్టేంత స్వేచ్చ అరాచక వ్యక్తులకు లభించింది. గత వారం కుప్పంలో మునిస్వామి అనే వైసీపీ కౌన్సిలర్ అనుచరుల సైకో చేష్టల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ వ్యక్తిని మొదట సైకో గుంపు కొట్టింది. అతను ఆస్పత్రిలో చేరితే.. ఆస్పత్రికి వెళ్లి కొట్టింది. డాన్సులు చేస్తూ కొట్టి.. వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతే పోలీసులు తీరుబడిగా స్పందించి కేసులు పెట్టామన్నారు. అరెస్టు చేశారో… స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారో ఎవరికీ తెలియదు.
తాజాగా ఆనం వెంకటరమణారెడ్డి ఇంట్లోకి పట్టపగలు దాడికోసం దుండగులు వెళ్తున్న దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఇంత ధైర్యంగా ఓ వ్యక్తిపై దాడి చేయడానికి వెళ్తున్న ముఠాలు ఎంతకైనా తెగిస్తాయని సులువుగా అర్థం చేసుకోవచ్చు. గతంలో టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తనే కేసులు లేవు. పట్టాభి ఇంటిలో విధ్వంసం చేసి ఆయనపైనే కేసులు పెట్టారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో ఎవరికైనా గ్యారంటీ ఉంటుందని చెప్పడం కష్టం. ఏపీ పోలీసులపై ఏ ఒక్కరూ నమ్మకం పెట్టుకోలేని పరిస్థితుల్లోకి వ్యవస్థ వెళ్లిపోయింది.
రాజకీయాలు వేరు లా అండ్ ఆర్డర్ వేరు. ప్రజల్ని ప్రశాంతంగా బతకనీయకపోతే పోలీసు వ్యవస్థ ఉండటం దండగ. బాధితులపైనే కేసులు పెట్టడం.. దాడులకు కావాల్సిన సమాచారాన్ని అందించడం లాంటి నీచమైన పనులకు పోలీసు శాఖ చేస్తోందని.. మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నం… గుంటూరులో గుప్తాపై బాలినేని అనుచరులు దాడులు వంటి ఘటనలు నిరూపిస్తూంటాయి. ఇప్పుడు ఆనం వ్యవహారం మరింత సంచలనం. ఇలాంటి అభద్రతా వ్యవస్థలో ఎవరికి రక్షణ ఉంటుంది