చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. సినిమా వాళ్లు ఈ విషయాన్ని బలంగా నమ్ముతారు. చిన్న సినిమానైనా, భారీగా ప్రమోషన్లు చేస్తారు. అలా చేయడం వల్ల… ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. `బేబీ` అనే చిన్న సినిమాకి ఓ పెద్ద సినిమాకి వచ్చే ఓపెనింగ్స్ రావడం వెనుక ఉన్నది ప్రమోషన్ స్ట్రాటజీనే.
అలాంటిది ప్రభాస్ సినిమాకి ఏ రేంజ్లో ప్రమోషన్ చేయాలి..? ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్. తన సినిమా అంటే.. అన్ని వైపుల నుంచీ అభిమానులు ఆసక్తిగా గమనిస్తారు. కానీ ఎందుకో… ప్రభాస్ సినిమాలకు సరైన ప్రమోషన్ స్ట్రాటజీని నిర్మాతలు అనుసరించడం లేదనిపిస్తోంది. రాధే శ్యామ్ నుంచీ ఇదే తంతు. ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్లు బయటకు వదలడంలో యూవీ క్రియేషన్స్ మీనమేషాలు లెక్కించింది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ ఇది. అయినా ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఏం కావాలో తెలీక తికమకపడింది. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం నిర్మాతలపై తమ కోపాన్ని చాలా సార్లు సోషల్ మీడియా సాక్షిగా బయటపెట్టేశారు.
ఆదిపురుష్కీ అంతే. ఈ సినిమాకి తెలుగులో అస్సలు ప్రమోషన్లు చేయలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఒక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో చేతులు దులుపుకొన్నారు. మొదట విడుదల చేసిన టీజర్ అయితే నాశిరకంగా ఉందన్న విమర్శలొచ్చాయి. ఈ సినిమా నుంచి ఏ అప్ డేట్ వచ్చినా ఉదయం 7 గంటలకు వదిలారు. ఆ టైమింగ్ చూసి ఫ్యాన్స్ పెదవి విరిచారు. సలార్ టీజర్ అయితే తెల్లవారుఝామున 5 గంటలకు వదిలారు. అది.. ఏ రకంగానూ సరైన టైమ్ కాదు. ప్రాజెక్ట్ కె ప్రమోషన్లు కూడా సంతృప్తికరంగా లేవు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ప్రభాస్ లుక్ బయటకు రాలేదు. దీపికా పదుకొణె లుక్ మాత్రం వదిలారు. ఈ లుక్ కోసం ఫ్యాన్స్‌ని వెయిట్ చేయించారు. ఎప్పుడో అర్థరాత్రి లుక్ బయటకు వచ్చింది. అయితే ఆ లుక్ కూడా షాకింగ్ గానో, ఆశ్చర్యకరంగానో, ఆసక్తికరంగానో లేదు. జస్ట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడానికి దీపికా ఓ సెల్ఫీ తీసుకొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంతేతప్ప.. ప్రాజెక్ట్ కె సినిమాలో తన పాత్రని పరిచయం చేసేదిలా ఈ లుక్ లేకపోవడం అభిమానుల్ని నిరాశ పరిచింది. ఇందుకోసమా… ఇంతపేపు ఎదురు చూశాం.. అంటూ పెదవి విరుస్తున్నారు.
ప్రభాస్ లాంటి హీరో సినిమాకి ప్రమోషన్ ఎందుకు? అని దర్శక నిర్మాతలు భావించి ఉండొచ్చు. కాకపోతే ఈ స్ట్రాటజీ వర్కవుట్ కాదు. ఆర్.ఆర్.ఆర్ ఎంత పెద్ద సినిమా? అందులో ఇద్దరు స్టార్స్ ఉన్నారు. అయినా సరే, ఆ సినిమా ప్రమోషన్ల కోసం పెద్ద కసరత్తే జరిగింది. పాన్ ఇండియా వ్యాప్తిగా ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రదక్షణలు చేసింది. ప్రమోషన్స్‌ని పద్ధతి ప్రకారం చేసుకొంటూ వెళ్లింది. ఆ సినిమా విజయంలో ప్రమోషన్లదీ పెద్ద పాత్రే. ఈ విషయంలో మిగిలిన దర్శకులూ రాజమౌళిని ఆదర్శంగా తీసుకొంటే మంచిది.