క్యారెక్టర్ కోసం ఇమేజ్ లెక్కలు వేయకుండా వొళ్ళు హూనం చేసుకునే నటుడు విక్రమ్. ఆయన సినిమా ఫెయిల్ అవుతుందేమో కానీ నటుడికి ఆయన ప్రయత్నానికి ఎప్పుడూ మంచి మార్కులే పడతాయి. లేటెస్ట్ గా ‘వీరధీరశూర’ సినిమాతో వచ్చాడు విక్రమ్. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. దర్శకుడు అరుణ్ కుమార్ చాలా కొత్త ఎప్రోచ్ తో సినిమా తీశాడు. టేకింగ్ లో ఓ కొత్తదారిని చూపించిన సినిమా ఇది. క్యారెక్టర్ పరంగా కూడా విక్రమ్ కష్టాన్ని మెచ్చుకోవాలి. ఎక్కడా ఎలివేషన్ లేకుండా కాళి పాత్రలోనే కనిపించాడు. చాలా సహజంగా ఫైట్లు చేశాడు. లెన్తీ సింగిల్ షాట్స్ లో తను కనిపించిన తీరు, క్యారెక్టర్ కోసం పడిన కష్టం తెరపై కనిపిస్తుంది.
అయితే సినిమాకి అనుకున్నంత ఫుట్ ఫాల్స్ కనిపించలేదు. సరైన ప్రమోషన్స్ లేకపోవడం ఒక కారణం అయితే, లిమిటెడ్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం మరో కారణం. అయితే సినిమా కోసం విక్రమ్ పడిన కష్టం వృధా కాదనే చెప్పాలి. ఒక యాక్షన్ సినిమాని ఇలాంటి అప్రోచ్ తో కూడా తీయొచ్చనే ఓ కొత్తదారిని సినిమా చూపించింది. మున్ముందు ఇలాంటి స్టయిల్ మేకింగ్ లో సినిమాలు వస్తే గనుక సినిమా స్వరూపంలో ఓ కొత్త ఒరవడి వస్తుందనే చెప్పాలి.