ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల వేదన వర్ణనాతీతంగా మారింది. జీతాలు పెంచాలని చేసిన ఉద్యమాలు చివరకు జీతాలు తగ్గించినా ఏమీ చేయలేని స్థితికి చేరాయి. అసలు పీఆర్సీ కోసం నియమించిన అశుతోష్ కమిటీ మిశ్రా నివేదికను పూర్తిగా పక్కన పెట్టేసి అధికారులతో తమకు కావాల్సిన నివేదిక ఇప్పించుకున్న ప్రభుత్వం.. జీతాల్లో కోత వేసేసింది. డీఏలు.. పెండింగ్ లేకుండా అన్నీ చూసుకుంది. హెచ్ఆర్ఏ కోత విధించిది. మొత్తంగా చూస్తే జీతం ఏ మాత్రం పెరగకపోగా.. ఒక్కో ఉద్యోగి జీతం నాలుగు, ఐదు వేల వరకూ తగ్గిపోనుంది. జీవనం ఖర్చులు పెరుగుతున్న దశలో ఇలా జీతాలు తగ్గడం ఆశనిపాతమే.
ఉద్యోగులు ఆందోళన చేస్తామని.. అవసరమైతే సమ్మెకు సిద్ధమని చెబుతున్నారు కానీ వారికి సామాన్య ప్రజల నుంచి సపోర్ట్ లభించడం లేదు. ఉద్యోగులకు అలా జరిగి తీరాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వినిపిస్తున్నారు. ఉద్యోగులకు సంఘిభావం ప్రకటించడానికి కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం ఉద్యోగ సంఘ నేతలు చేసినఓవరాక్షనే కారణం అని అనుకోవచ్చు. రాజకీయ ప్రకటనలు చేయడంలో చాలా మంది రాటుదేలిపోయారు. ఉద్యోగ సంఘాల నేతలు ఓ పార్టీకి కొమ్ము కాసినట్లుగా వ్యవహరించారు. స్థానిక ఎన్నికల సమయంలో వారి విన్యాసాలు అందర్నీ అవాక్కయ్యేలా చేశాయి. దీంతో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి మద్దతును వారు పోగొట్టుకున్నారు.
అదే సమయంలో ఇప్పుడు ప్రభుత్వం తీరుతో.. ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ అనుకూల వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం అన్నీ ఆలోచించి జీతాలు తగ్గించింది కాబట్టి వాటితో సరి పెట్టుకోవాలని… ప్రభుత్వ వ్యతిరేకత పెంచే పనులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. అటు ప్రభుత్వ అనుకూల.. ఇటు ప్రభుత్వ వ్యతిరేక వర్గాలల్లో సానుభూతిని ఉద్యోగ సంఘాలు కోల్పోయాయి. దీంతో వారి పోరాటానికి బయట నుంచి ఎలాంటి మద్దతూ లభించే అవకాశం కనిపించడం లేదు.
ఇక ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడం ఎప్పుడో మానేశారు. అలాంటి వారి పట్ల ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది. వారికి అలా జరగాల్సిందేనన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఉద్యోగులు రెంటికి చెడ్డ రేవడి అయ్యారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.