చిన్న సినిమాలకు ధియేటర్లు దొరకడం లేదన్నది అందరి మాట! అది నిజం కూడాను. పెద్ద సినిమా ఆడుతోందంటే, దాని మధ్య చిన్న సినిమా పూర్తిగా నలిగిపోతోంది. థియేటర్లు దొరక్క బిక్క మొహం వేస్తోంది. ఆఖరికి ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాకీ అదే పరిస్థితి. దశాబ్దాలుగా టాలీవుడ్లో సూపర్ స్టార్ హోదా అనుభవించారు కృష్ణ. ఇప్పటికీ ఆయనంటే ఇష్టపడే అభిమాన గణం ఉంది. మహేష్ అభిమానులు కూడా కృష్ఱ సినిమాలంటే ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి కృష్ణ సినిమాకీ థియేటర్లకు కొరతొచ్చింది. ఆయన నటించిన తాజా చిత్రం శ్రీశ్రీ. విజయ నిర్మల, నరేష్ ప్రధాన పాత్రలు వహించారు. ఈ రోజే ఈ చిత్రం థియేటర్ల ముందుకు వస్తోంది. హైదరాబాద్ మొత్తం నాలుగంటే నాలుగు థియేటర్లే దొరికాయి. మిగిలిన చోట్ల పరిస్థితి ఇంకా ఘోరం. రెండు రాష్ట్ర్రాల్లోనూ కనీసం 50 థియేటర్లు కూడా లేని దుస్థితి.
ఓవర్సీస్లో అయితే ఒక్క స్ర్కీన్ కూడా ఇవ్వరని తెలిసి ముందస్తుగానే ఈ సినిమాని ఆన్లైన్లో విడుదల చేశారు. తెలుగు రాష్ట్ర్రాల్లోనూ ఈ పద్ధతిలోనే విడుదల చేస్తే బాగుణ్ణు. ఈ సినిమా విడుదలైన వారం పది రోజులకే యూ ట్యూబ్లో పెట్టాలన్న ఆలోచన ఉందట. దాన్ని బట్టి సూపర్ స్టార్ పరిస్థితేంటో అర్థమవుతోంది. కృష్ణలాంటి నటుడలో సినిమాలు చేసేటప్పుడైనా నిర్మాతలు కాస్త జాగ్రత్త పాటిస్తే బాగుండును. కాస్త ప్రమోషన్లు చేసుకొని, పెద్ద సినిమాలేం లేనప్పుడు విడుదల చేస్తే.. థియేటర్లు దొరికే ఆస్కారం ఉండేది.