సినీ పరిశ్రమ ఏపీలో లేదు. కానీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎంతగా వేధించిందో చూస్తే టాలీవుడ్ లో భాగం అనుకునే ఎవరికైనా పళ్లు పటపట కొరకాలని అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి దేశ రెండో అత్యున్నత పురస్కారం అందుకున్నారు. కానీ ఈ మెగాస్టార్ విషయంలో జగన్ రెడ్డి వ్యవహరించిన విధానం చూస్తే… మండిపోకుండా ఉంటుందా ?. ఒక్క చిరంజీవినే కాదు.. టిక్కెట్ రేట్లు పది రూపాయలుగా డిసైడ్ చేసి..పెంచాలంటే తమ కు లొంగాలన్నట్లుగా చేసిన రాజకీయం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మరి ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడేం చేస్తున్నారు ? . అరకొర ట్వీట్లతో సపోర్ట్ చేస్తున్నారు . టాలీవుడ్ పౌరుషం ఇదేనా ?
వైసీపీ ప్రభుత్వ వేధింపులు టాలీవుడ్‌కు గుర్తు లేవా ?
టాలీవుడ్ ను లొంగ దీసుకోవడానికి వైఎస్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల ఒక్క పవన్ మాత్రమే కాదు… మిగతా హీరోలు ఇబ్బందులు పడ్డారు. ‘శ్యామ్ సింగ రాయ్’ విడుదల సమయంలో నానిని వైసీపీ టార్గెట్ చేసింది. ‘భీమ్లా నాయక్’ విడుదల సమయంలో జగన్ ప్రభుత్వ విధానాలతో నిర్మాత నాగవంశీ ఇబ్బంది పడ్డారు. పవన్ నిర్మాతలే కాదు… పైకి చెప్పకున్నా మిగతా నిర్మాతలూ సమస్యలు ఎదుర్కొన్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులను థియేటర్ల చుట్టూ తిప్పించి డ్యూటీలు చేయించిన దృశ్యాలు టాలీవుడ్ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. తెలుగు చిత్రసీమ విషయంలో జగన్ ప్రభుత్వం అవలంబించిన విధానాలు, టికెట్ రేట్స్ విషయంలో తీసుకు వచ్చిన పాలసీలు, హీరోలను అమరావతి ఆహ్వానించి అక్కడ వ్యవహరించిన తీరు టాలీవుడ్ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. జగన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన అధికారంతో తన ముందు రీల్ హీరోలు బచ్చాలని అనిపించడానికి కుట్ర చేసి మరీ పరువు తీశారు.
పవన్ సపోర్టుగా కొంత మంది ట్వీట్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , ఆయన స్థాపించిన జనసేన పార్టీకి… ఆ పార్టీ ఉన్న ఎన్డీయే కూటమికి మద్దతుగా కొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. ఈ జాబితాలోకి అల్లు అర్జున్ కూడా చేరారు. చిరంజీవి వీడియో విడుదల చేశారు. చిరు వీడియో కంటే ముందు పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు మెగా కుటుంబంలో యువ హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్. పవన్ వెంట కొరియోగ్రాఫర్ జానీ, సీనియర్ నటుడు పృథ్వీ, నటుడు ‘హైపర్’ ఆది అడుగులు వేస్తున్నారు. మె రాజకీయాల్లో అతి పెద్ద యుద్ధం ఎదుర్కోబోతున్న పవన్ కల్యాణ్ గారు ఆయన కోరుకున్నది సాధించాలని, వాగ్ధానాలు నిలబెట్టుకోవాలని చిత్రసీమకు చెందిన సభ్యుడిగా ఆకాంక్షిస్తున్నట్టు నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు జనానికి నువ్వు కావాలి’ అని శరత్ బాబు చెప్పే మాటను యువ హీరో రాజ్ తరుణ్ కోట్ చేసి ట్వీట్ చేశారు. యువ హీరో తేజా సజ్జా కూడా సపోర్టు చేశారు.
ఇది సరిపోదు.. తిరగబడాల్సిందే !
నలుగురు హీరోలు ట్వీట్ చేయడం వల్ల టాలీవుడ్ ధైర్యంగా ముందుకు వచ్చినట్లు కాదు. అంతకు మించి రావాల్సి ఉంది. ఇప్పుడు భయపడితే తర్వాత వచ్చే వాళ్లు కనీస విలువ కూడా ఇవ్వరు. తమ విలువ కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు టాలీవుడ్ పై ఉంది. తమ కు గౌరవం ఇచ్చే వారికి మద్దతు ఇవ్వకపోతే.. ఇక ఇప్పటికీ ఆ గౌరవం లభించే అవకాశం ఉండదు. ఆత్మగౌరవం కాపాడుకోలేని జన్మ వ్యర్థం. మరోసారి జగన్ గెలిస్తే… అనే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గెలిచినా ఇప్పుడు చేసిన దాని కంటే ఎక్కువ నష్టం చేయలేడు. ఏపీలో సినిమాలు ఆపేస్తే… నిర్మాతలే కాదు.. ప్రభుత్వం కూడా నష్టపోతుంది.
అందుకే ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే తిరగబడాల్సిందే. లేకపోతే సినీ పరిశ్రమ ఎప్పుడూ గౌరవానికి దూరంగానే ఉండిపోతుంది.