ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన టీటీడీ బోర్డు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రూ. 25 నుంచి యాభైకి చేసింది. లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే పదార్థాల రేట్లు పెరిగాయని.. తీవ్రమైన నష్టాలు వస్తున్నాయని అందుకే… ధర పెంచామని టీటీడీ బోర్డు సభ్యులు కవర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పాత రేటు పాతిక రూపాయలకే… శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్ముతున్నారు. తిరుమలకు భక్తులు వెళ్లే వీలు లేదు కనుక ప్రసాదాల్ని భక్తుల దగ్గరకే తీసుకెళ్తున్నారు. అన్ని చోట్లా అందుబాటులో ఉంచి అమ్మాలని నిర్ణయించారు.
జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాలు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఉన్న సమాచార కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరైనా ఎక్కువ మోతాదులో లడ్డూ ప్రసాదం తీసుకుని భక్తులకు పంచదలచుకుంటే బల్క్‌గా కూడా ఇస్తామని టీటీడీ ప్రకటించింది. అయితే.. ఈ తగ్గింపు ఎప్పుడూ కాదు. లాక్డౌన్ ముగిసే వరకు మాత్రమే. స్వామివారి లడ్డూ ప్రసాదం అందించాలని భక్తుల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని.. అందుకే.. తక్కువ ధరకు అందిస్తున్నామని టీటీడీ చైర్మన్ చెప్పుకొచ్చారు. గతంలో రూ. పాతిక ఉన్న లడ్డూ ధరను పెంచాలని భక్తులేమీ కోరలేదు కదా.. అన్న లాజిక్‌లు భక్తులకు అడగకూడదు.
టీటీడీని నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోందని.. అందుకే ఇలా ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందని వస్తున్న విమర్శలు టీటీడీ అధికారులు ఖండించారు. టీటీడీ నిర్వహణకు గానీ, ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు గానీ ఎలాంటి నిధుల కొరత లేదని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో.. చెప్పలేని పరిస్థితి ఉందని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.