జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని.. తనను తాను నియంత్రించుకుంటున్నారని… అది ఆయన రాజకీయ జీవితానికి మైనస్‌గా మారిందని కొద్ది రోజులుగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అయితే వీరికి భిన్నంగా..మాజీ ఎంపీ… తనను తాను రాజకీయ విశ్లేషకుడిగా చెప్పుకునే లగడపాటి రాజగోపాల్ స్పందించారు. పవన్ రాజకీయ అడుగులు గొప్పగా వేస్తున్నారని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విజయవాడలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. పవన్ కల్యాణ్ గురించే స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ప్రజల కోసం నిలబడుతున్నారని.. ఆయన రాజకీయ వ్యూహాలు బాగున్నాయని చెప్పుకొచ్చారు.
అనూహ్యంగా లగడపాటి రాజగోపాల్ పవన్ కల్యాణ్‌ను పొగడటానికి కారణం ఏమిటో కానీ.. జనసైనికులకు మాత్రం కాస్త క్లారిటీ వచ్చింది. పవన్ కల్యాణ్ మొహమాట రాజకీయాలు చేయడం లేదని.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే… రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయానికి వస్తున్నారు. అయితే లగడపాటి పవన్ కల్యాణ్‌ను ప్రశంసించడం వెనుక ఏదైనా తెర వెనుకరాజకీయం ఉందా.. అన్న అనుమానం కూడా జనసేన వర్గాల్లో ప్రారంభమయింది. గతంలో సర్వేలు చేసి.. చేతులు కాల్చుకున్న లగడపాటి.. చాలా కాలంగా రాజకీయ వ్యాఖ్యలకు.. సర్వేలకు దూరంగా ఉంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చేది లేదని చెబుతున్నారు.
సర్వేలు కూడా చేయనంటున్నారు. అయితే గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేశారు. ఆ పార్టీ పతనంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు.. ఆయన పవన్ ను ఎందుకు పొగుడుతున్నారోనని.. జనసైనికుల్లో కొద్దిగా సందేహం కూడా ప్రారంభమయింది. లగడపాటి మాటలు నచ్చి… పవన్ కల్యాణ్ మాటలు కలిపితే.. ఏం సలహాలిస్తారోనని.. వాటిని పవన్ పాటిస్తారేమోనని మరికొంత మంది ఆందోళన.