విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిన్న డిల్లీలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసారు. ఆంధ్రభవన్ లో తన ఛాంబర్ లో చంద్రబాబు నాయుడు అధికారులతో సమావేశమవుతున్న సమయంలో లగడపాటి వచ్చి కలిసారు. అధికారులతో నిర్వహిస్తున్న సమావేశాన్ని కాసేపు నిలిపివేసి లగడపాటి, చంద్రబాబు, డిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కంబంపాటి రామ్మోహన్ రావు ముగ్గురూ వేరేగా సమావేశమయ్యారు. సుమారు అర్ధ గంట సేపు వారు ముగ్గురూ మాట్లాడుకొన్నారు. లగడపాటి ముఖ్యమంత్రిని ఎందుకు కలిసారో తెలియదు, కానీ ఆయన తెదేపాలో చేరేందుకే కలిసారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కానీ ఆయన వేరే కారణాలతో ముఖ్యమంత్రిని కలిసి ఉండవచ్చును. వచ్చే నెలలో రాజధాని అమరావతికి శంఖుస్థాపన చేసిన తరువాత అక్కడ చాలా భారీ నిర్మాణ కార్యక్రమాలు మొదలవబోతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి, వ్యాపార, నిర్మాణ రంగాలలో ఉన్న లగడపాటి తన సంస్థలకు కూడా కొన్ని కాంట్రాక్టులు ఆశించడం సహజం. పైగా ఆయన విజయవాడకే చెందినవారు. కనుక రాజధాని నిర్మాణంలో తను పాలుపంచుకోవాలనుకొంటే అందులో విచిత్రం ఏమీ లేదు. బహుశః ఆపని మీదే ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఉండవచ్చును. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకొంటానని చెప్పి దానికి కట్టుబడి ఉన్న లగడపాటి, అప్పటి నుండి తన వ్యాపారాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి పనిచేసుకొంటున్నారు. ఆ ప్రయత్నంలోనే తెలంగాణా ప్రభుత్వంతో సత్సంబంధాలు పెంపొందించుకొన్నారు. వ్యాపారవేత్త అయిన ఇప్పుడు తెదేపా ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండాలనుకొంటే అందులో తప్పులేదు.ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చేసి వ్యాపారాలు చూసుకొంటున్నారు. కనుక ఆయన ఒక వ్యాపారవేత్తగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ఉండవచ్చును.
కృష్ణా, గుంటూరు జిల్లాలలో తెదేపాకి చాలా బలమయిన నేతలున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలో తెదేపా “హౌస్ ఫుల్” అయిపోయింది. ప్రస్తుతం ఉన్నవారి మధ్యే అక్కడ ఆధిపత్యపోరు సాగుతోంది. కనుక ఒకవేళ లగడపాటి తెదేపాలో చేరినా పార్టీకి, ఆయనకి కూడా ప్రయోజనం ఉండకపోగా ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. జిల్లాకు చెందిన లగడపాటికి ఈ విషయాలన్నీ తెలియవని భావించలేము. కనుక బహుశః ఆయన తెదేపాలో చేరేందుకు కాక తన వ్యాపార పనుల మీద ముఖ్యమంత్రిని కలిసి ఉండవచ్చును. అధికార పార్టీ అయిన తెదేపాలో చేరడం మంచి నిర్ణయమేకావచ్చును. కానీ పైన పేర్కొన్న విషయాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే లగడపాటి తెదేపాలో చేరడం వలన లాభం కంటే సమస్యలే ఎక్కువ ఎదురవవచ్చును. ఇటువంటి వార్తలపై తక్షణమే స్పందించడం లగడపాటికి అలవాటు. కనుక నేడోరేపో ఆయనే స్వయంగా తను ముఖ్యమంత్రిని ఎందుకు కలిసారో తెలియజేయవచ్చును. కనుక అంతవరకు వేచి చూడక తప్పదు.