ఎన్నికలు వచ్చాయంటే చాలా సర్వేలు వస్తుంటాయి. అయితే, ఇలాంటి సర్వేలపై ప్రజలకు కూడా గతంలో ఉన్నంత ఆసక్తి ఉండటం లేదు. ఎందుకంటే, ఒక్కో సర్వే ఒక్కో పార్టీకి అనుకూలంగా ఉంటోంది! మామూలు సర్వేలు అన్నీ ఒకెత్తు అయితే.. ఎన్నికల వేళ విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేయించే సర్వేలకు ఉన్న ప్రాధాన్యత మరో ఎత్తు. ఆయన చేయించే సర్వేలు ఎన్నికల ఫలితాలకు దాదాపు దగ్గరగా ఉండటమే అందుకు కారణం. 2014లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో తెరాస అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు కాబట్టి, సర్వే మరింత నిష్పాక్షికంగా ఉంటుందని అనేవారూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి నంద్యాల ఉప ఎన్నికలపై పడిందని తెలుస్తోంది. నియోజక వర్గంలో ఓ నాలుగు రోజులపాటు లగడపాటి సర్వే చేయించినట్టు కథనాలు వస్తున్నాయి.
సర్వే ఫలితాలేవీ ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు. ఎందుకంటే, ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత మరోసారి సర్వే చేయిస్తారని.. ఆ తరువాత, తుది ఫలితాలను లగడపాటి వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఇంతవరకూ చేసిన సర్వే వివరాలను టీడీపీ వర్గాలకు చేరవేసినట్టు కొంతమంది చెబుతున్నారు. భూమా మరణం తరువాత టీడీపీకి సానుభూతి వర్కౌట్ అవుతుందని, కానీ శిల్పా మోహన్ రెడ్డి వర్గం పార్టీకి దూరం కావడం మైనస్సే అని లగడపాటి సర్వే చెప్పిందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి… కొన్నాళ్లపాటు వార్తల్లో లేకుండాపోయారు లగడపాటి. కానీ, ఆ మధ్య అనూహ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలుసుకోవడం చర్చనీయాంశమైంది. క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన తిరిగి వస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పుడు సర్వేకు సంబంధించిన వివరాలను టీడీపీ వర్గాలకు చేరవేశారని వినిపిస్తూ ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే.. లగడపాటి సర్వే తమకే అనుకూలంగా ఉందంటూ వైకాపా వర్గాల్లో కూడా చర్చ జరుగుతోందట! అంతేకాదు, కొన్ని మీడియా సంస్థలు కూడా నంద్యాలలో వైకాపా గెలుస్తుందని సర్వే చెప్పినట్టు కథనాలు కూడా ప్రచురించేస్తున్నాయి. టీడీపీకి ఎదురుదెబ్బ ఖాయమనీ, భూమా మరణించినా సానుభూతి వర్కౌట్ కాదనీ లగడపాటి సర్వే ద్వారా తేలిందంటూ వైకాపా వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా లగడపాటి సర్వేకు క్రేజ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి. నంద్యాల విషయంలో లగడపాటి జోస్యం ఎలా ఉంటుందో చూడాలి.