ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు పొందిన లగడపాటి రాజగోపాల్ ఇకపై రాజకీయ సర్వేలు చేయనంటూ అస్త్రసన్యాసం చేశారు. దీనికి సంబంధించి ఒక బహిరంగ లేఖ రాస్తూ… ప్రజాభిప్రాయాన్ని తాను సరిగా ప్రతిబింబించ లేకపోయినందుకు చింతిస్తున్నా అన్నారు. రాజకీయాలకు దూరమైన దగ్గర్నుంచీ తాను ఏ పార్టీకీ అనుకూలంగా వ్యవహరించకుండా, తటస్థంగానే ఉంటూ వచ్చానన్నారు. అదే పద్ధతిన సర్వేలు చేశానన్నారు. అయితే, తన సర్వేల వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించాలని లగడపాటి కోరారు. వరుసగా రెండుసార్లు తన లెక్కలు తప్పాయి కాబట్టి, ఇకపై ఈ సర్వేలు చెయ్యనంటూ స్పష్టం చేశారు.
సర్వేలకు లగడపాటి స్వస్తి చెప్పడం ఓరకంగా ఆయన చేసిన మంచి పని అని చాలామంది అంటున్నారు! ఎందుకంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, ఇప్పుడు ఏపీ ఎన్నికల సందర్భంలోగానీ ఆయన ఇచ్చిన సర్వే లెక్కలు తీవ్ర గందరగోళానికి కారణమయ్యాయని అనొచ్చు! ఆయన సర్వేల వల్ల తెలంగాణ, ఆంధ్రాలో సమస్యలు సృష్టించారనేది కొంతమంది భావన. మరీ ముఖ్యంగా, ఏపీలో ఎన్నికలకు ముందు కూడా ఆయన సర్వేలు చేసి, చంద్రబాబుకు కొన్ని నివేదికలు ఇచ్చారనే ప్రచారమూ జరిగిన సంగతీ తెలిసిందే. తెలుగుదేశం – జనసేనల మధ్య సయోధ్య కుదరకపోవడానికి కారణం కూడా లగడపాటి ఇచ్చిన ఫీడ్ వల్లనే అనేది కూడా ఓ ప్రచారం ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకోకపోయినా ఫర్వాలేదనీ, టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లొచ్చని ఆయనే సూచించారనీ అంటారు! ఒంటరిగా టీడీపీ గెలుపు ఖాయమని కొన్ని సర్వేల నివేదికలు చూపించడం వల్లనే, గడచిన ఎన్నికల్లో పొత్తుల గురించి చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదనేది కొంతమంది టీడీపీ నేతల అభిప్రాయంగా వినిపించింది!
కారణాలేవైనా లగడపాటి సర్వేలు వరుసగా రెండుసార్లు ఫెయిలయ్యాయి. కనీసం, వాస్తవ ఫలితాలకు కాస్త అటు ఇటుగా ఆయన అంచనాలు చెప్పినా, కొంత మర్యాద దక్కేది. ఇంత జరిగాక కూడా ఆయన సర్వే అంటూ మరోసారి బయటకి వస్తే…. మరింత అవమానమే తప్ప, ఆదరణ అస్సలు ఉండదనేది వాస్తవం. కాబట్టి, అస్త్ర సన్యాసమే హుందాగా వ్యవహరించి తీసుకున్న మంచి నిర్ణయం అనేది చాలామంది అభిప్రాయం.