లగడపాటి రాజగోపాల్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఆయన మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయన అనుచరులు మళ్లీ హడావుడి ప్రారంభించారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నామని మీడియాకు లీక్ చేస్తున్నారు. త్వరలో లగడపాటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. దీంతో మళ్లీ లగడపాటి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది.
కాంగ్రెస్ తరఫున లగడపాటి 2004, 2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీచేసి గెలిచారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. అందుకే గత రెండు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఇప్పుడు ఆయన రాజకీయాల వైపు చూస్తున్నారని అంటున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలకు విజయవాడ అభ్యర్థి సమస్య ఉంది. టీడీపీలో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. వైసీపీకి అసలు అభ్యర్థే లేరు. ఇప్పటి వరకూ ఎవరి పేరూ ప్రచారంలోకి రాలేదు. లగడపాటి అయితే తిరుగులేని అభ్యర్థి అవుతారన్న అభిప్రాయం ఉంది.
భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆయనకు ఆ పార్టీ నుంచి ఆహ్వానం వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా లగడపాటికి ఆహ్వానం పంపారని అంటున్నారు. ఆయన అనుచరులు లగడపాటి కూడా మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. గతంలోలా ఈ సారి కూడా ఖండిస్తే.. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని అనుకోవచ్చు. మౌనంగా ఉన్నా.. పాజిటివ్ గా స్పందించినా… లగడపాటి ఎంట్రీకి రెడీ అవుతున్నారని అనుకోవచ్చు.