అవకాశం వస్తే తెలంగాణ నుంచి కచ్చితంగా లోక్ సభకు పోటీ చేస్తానని.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశం లేదన్నారు. ఆంధ్రా భావోద్వేగాలతో రాజకీయాలు చేయబోనన్నారు. తన కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి రారని ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన పేరుపై… వస్తున్న సర్వేలు కరెక్ట్ కాదనన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం ప్రజల నాడి చెబుతాను .. డిసెంబర్ 7 తర్వాత మా సర్వే వివరాలు వెల్లడిస్తానన్నారు. తెలంగాణ కాంగ్రెస్, – టీడీపీ పొత్తు ఫలితిస్తుందా.. మంచి ఫలితాన్ని ఇస్తుందా లేదా.. అన్నది ప్రజలే తేల్చాలన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌లు ఏ రాష్ట్రంలోనూ ప్రత్యర్థులు కాదని.. అందుకే పొత్తులు పెట్టుకుంటున్నాయని విశ్లేషించారు. పార్టీలు కోరితే ముందే సర్వేలు చేసి చెబుతానన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఎయిర్ పోర్టులో జరిగిన దాడిని లగడపాటి ఖండించారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించడం ఇప్పుడే కొత్త కాదని.. గతంలోనూ .. ప్రాంతీయ పార్టీలను ఏకం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటారన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన లగడపాటి.. దానికి తగ్గట్లుగానే గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన రాజకీయ ఆసక్తి మేరకు… ఎక్కడ ఎన్నికలు జరిగినా… తన టీంతో సర్వేలు చేయించి విడుదల చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలుమార్లు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దాంతో.. ఆయన టీడీపీలో చేరబోతున్నారని… అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే.. ఆయన ఎప్పుడూ రాజకీయాల్లోకి వస్తానన్న విషయాన్ని ధృవీకరించలేదు. కానీ… గట్టిగా ఖండించేవారు. ఈ సారి మాత్రం.. లగడపాటి మాటల్లో మార్పు కనిపించింది. అవకాశం వస్తే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో.. ఆయన రాజకీయాల్లోకి మళ్లీ రావడం ఖాయమని తేలిపోయిందన్న విశ్లేషణలు వస్తున్నాయి.
తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయన్న అభిప్రాయం లగడపాటిలో కనిపించింది. అందుకే ఆయన తెలంగాణ నుంచి పోటీ ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. చంద్రబాబు మహాకూటమి ప్రయత్నాలు కొనసాగుతున్నందున వచ్చే ఎన్నికల్లో కూడా.. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఉంటుందని… టీడీపీ లేదా కాంగ్రెస్ తరపున ఆయన ఏదో స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని భావించవచ్చు. మొత్తానికి అనూహ్యంగా… లగడపాటి ఈజ్ బ్యాక్ అన్న సందేశాన్ని తనే స్వయంగా పంపారు. కానీ తెలంగాణ నుంచి పోటీ అనేదే అనూహ్యమైనది…!