సైనికుడు సూర్యగా అల్లు అర్జున్ నటించిన సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించారు. నిన్న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడో తీర్పు ఇచ్చేశారు. అల్లు అర్జున్ క్యారెక్టర్ బాగుందనీ, అందులో అతడు బాగా నటించాడనీ చెప్పేశారు. హీరోకి మార్కులు బాగా పడ్డాయి. కథ రాసిన, తీసిన వక్కంతం వంశీకి అత్తెసరు మార్కులు వేశారు. కథనం బాగోలేదని తేల్చేశారు. నిర్మాత చెవిన ఈ మాటలు పడ్డాయో? లేదో? ఈ సినిమాను మహాభారతంతో పోల్చారు. పాండవులు మహాభారతంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొని, కష్టాలు పడి యుద్ధంలో చివరికి విజయం సాధించారో.. సినిమాలో అల్లు అర్జున్ అలా విజయం సాధించాడని లగడపాటి చెప్పుకొచ్చారు. సినిమాలో ఎన్నో కాంఫ్లిక్ట్ పాయింట్స్ వున్నాయన్నారు.
“మామూలుగా తీసే సినిమాలు చందమామ కథలు (కథ ఒక్క పేజీలో వుంటుంది) అయితే… ‘నా పేరు సూర్య’ ఒక పుస్తకం. ప్రేక్షకులు జీవితానికి సరిపడే పుస్తకం” అంటున్నారు లగడపాటి శ్రీధర్. అంతే కాదు.. పదేళ్లకు ఒకసారి ఇటువంటి అద్భుతమైన సినిమాలు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఓ యుగానికి రామాయణం, మరో యుగానికి మహాభారతం వచ్చినట్టు. వీడియో గేమ్స్, ఇంటర్నెట్ మాయలో పడి పుస్తకాలు చదవం మానేసిన ఈతరం యువత సూర్య సినిమా చూస్తే చాలా నేర్చుకోవచ్చట. ఏం నేర్చుకోవాలో కూడా ఆయనే చెబితే బాగుండేది.
ఇవన్నీ పక్కన పెడితే.. అల్లు అర్జున్‌ని ఏకంగా ఆమిర్ ఖాన్‌తో పోల్చారు లగడపాటి శ్రీధర్. హిందీలో ఆమీర్ ఖాన్‌కి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరుంది. ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసే ఆమిర్, అందుకోసం ఎంత కష్టపడడానికి అయినా వెనుకాడరు. ఆమిర్ అంత కాకపోయినా… తెలుగులో క్యారెక్టర్ కోసం తనవంతుగా కష్టపడే హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అతను ఆమిర్ స్థాయికి చేరుకోవడానికి ఈమాత్రం కష్టం సరిపోదేమో. ఇంకా విభిన్నమైన పాత్రలు, నటుడిగా పరీక్ష పెట్టే పాత్రలు చేయాలేమో. ఇంకొకటి… సూర్య పాత్రను పురాణాల్లో రాముడు, అర్జునుడు పాత్రలతో పోల్చేశారు లగడపాటి. సినిమాను ‘యాక్షన్ క్లాసిక్’గా ప్రకటించారు.