‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ అనే రెండు బ్లాక్ బస్టర్ల తరవాత రాబోతోంది ‘నా పేరు సూర్య’. వరుసగా మూడు సూపర్ హిట్లు పడితే… చిత్రసీమకు ఆనందమే. కాకపోతే.. ‘సూర్య..’కున్న క్రేజూ, ఈ సినిమా టాక్ని బట్టి చూస్తే – రంగస్థలం, భరత్‌ల ధాటికి తట్టుకోవడం కష్టసాధ్యమైన విషయంలా తోస్తోంది. టీజర్ చూస్తే… కచ్చితంగా ‘ఇదేదో సీరియస్ ఫిల్మ్’ అనే భావన కలగకమానదు. దాన్ని తగ్గించే ప్రయత్నం… చిత్రబృందం ఇప్పటి వరకూ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదో భారీ యాక్షన్ చిత్రం అనేలా హైప్ క్రియేట్ చేయాలని చిత్రబృందం తహతహలాడుతోంది. రంగస్థలం, భరత్ రెండూ.. కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుంటూనే, మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఓ కొత్త నేపథ్యంలో తీసిన సినిమాలు. వాటిలో అన్నీ ఉన్నాయి.కానీ ‘సూర్య’లో మాత్రం యాక్షన్ హంగామాని ఎక్కువ ఎలివేట్ చేస్తున్నారు.
దానికి తగ్గట్టుగానే నిర్మాత లగడపాటి శ్రీధర్ ‘మాది అవార్డు సినిమా’ అనే రేంజులో మాట్లాడుతున్నారు. ‘ఈ సినిమాకి జాతీయ అవార్డులు వస్తాయి. జాతీయ సమగ్రతా చిత్రంగా ‘సూర్య’ నిలుస్తుంది. అల్లు అర్జున్ నటనకూ అవార్డులు వస్తాయి’ అని ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ‘అవార్డు సినిమా’ అనగానే… మెగా ఫ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం ఖాయం. ఎందుకంటే బన్నీ నుంచి వాళ్లు అవార్డు సినిమా ఆశించడం లేదు. పక్కా కమర్షియల్ సినిమా కావాలి. అలాంటి సినిమా చూడాలనుకుంటుంటే.. ‘అవార్డు’ సినిమా అంటూ.. అభిమానుల్ని కాస్త గందరగోళంలోకి నెట్టుశారు నిర్మాత. ‘రంగస్థలం’ చిత్రాన్నీ చిరు అవార్డు సినిమాగానే అభివర్ణించారు. ఆసినిమాకి కోట్లకు కోట్లు వచ్చాయి. బహుశా.. ఆ సెంటిమెంట్‌తోనే లగడపాటి ఇలాంటి కామెంట్లు చేశారేమో.