మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. సర్వేల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన సర్వేలన్నీ కచ్చితత్వానికి మారుపేరుగా ఉండటంతో.. ఆయన మాట… ఓ బ్రాండ్‌గా మారిపోయింది. దీంతో.. ఆయన పేరుతో… ఎప్పటికప్పుడు సర్వేలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూంటాయి.అయితే అవన్నీ ఫేక్. తెలంగాణ ఎన్నికలపై కూడా సర్వే చేయిస్తున్నానని.. డిసెంబర్ ఏడో తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితం ప్రకటిస్తానని గతంలోనే లగడపాటి తెలిపారు. అయితే.. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత… మీడియాతో మాట్లాడిన సందర్భంలో… కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా .. తన సర్వేలో కొంత భాగాన్ని లీక్ చేశారనుకోవాలి.
తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి స్వతంత్రులు ఎనిమిది నుంచి పది స్థానాల్లో గెలవబోతున్నారని ప్రకటించారు. రోజుకు ఇద్దరు చొప్పున… గెలిచే స్థానాల పేర్లు వెల్లడిస్తానని చెప్పి… తొలి రోజుకు రెండు పేర్లు అయితే ప్రకటించారు. అందులో ఒకటి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట కాగా.. మరొకటి.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం. నారాయణ పేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడిన శివకుమార్ రెడ్డి.. బీఎల్ఎఫ్ తరపున పోటీ చేస్తున్నారు. ఆయనకు గెలవబోతున్నారని లగడపాటి తేల్చారు. గత ఎన్నికల్లోనూ శివకుమార్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో… కాంగ్రెస్ పార్టీ రెబల్ గా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ జాదవ్ గెలుస్తారని లగడపాటి జోస్యం చెప్పారు. వరుసగా మరో నాలుగు రోజుల పాటు రోజుకు రెండు పేర్లు విడుదల చేయనున్నారు.
లగడపాటి మాటలను బట్టి చూస్తే.. ఇండిపెండెంట్లుగా గెలిచే అభ్యర్థులే కింగ్ మేకర్లు అవుతారన్న విషయం స్పష్టమవుతుంది. అంటే… తెలంగాణలో హంగ్ వస్తుందన్న అభిప్రాయానికి రాజకీయవర్గాలు వస్తున్నాయి. ఈ విషయంలో.. ప్రధాన పార్టీల ప్రలోభాలకు తెలంగాణ ప్రజలు లొంగడం లేదని.. లగడపాటి చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. హంగ్ ఖాయమని.. లగడపాటి.. చెప్పకనే చెప్పినట్లయింది.