తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల కుమారులు, వారసులు హీరోలుగా రావడం కొత్తేమీ కాదు. అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, రామ్, అల్లు శిరీష్ తదితరులు వున్నారు. అయితే… ఒక్క సినిమాతో ఇద్దరు వారసులు, అదీ నిర్మాతల తనయులు హీరోలుగా పరిచయం అవుతుండటం బహుశా ఇదే తొలిసారి ఏమో!! అసలు వివరాల్లోకి వెళితే… హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అని ఓ సినిమా వచ్చిన విషయం గుర్తుండే వుంటుంది. ఆ సినిమా దర్శకుడు శివరాజ్ కనుమూరి కొంత విరామం తరవాత కొత్త సినిమా ప్రారంభించారు. అందులో నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్, నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ హీరోలు. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో అన్వర్ పాత్రలో లగడపాటి విక్రమ్ నటించాడు. హీరోగా అతడికి ఇదే తొలి సినిమా. ఇక, ‘పెళ్లి చూపులు’, ‘మెంటల్ మదిలో’ సినిమాలు నిర్మించిన రాజ్ కందుకూరి తనయుడు శివ ఈ సినిమాతో హీరోగా, నటుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.